CM Breakfast Scheme Telangana: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కాంగ్రెస్ ఆపేయడంపై కేటీఆర్ స్పందించారు. ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొంద పెట్టిందని.. ఇప్పుడు దాన్ని అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం వేళ ఉచితంగా అల్పాహారం పెట్టేవారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేసి పిల్లల కడుపు మీద కొట్టిందని అన్నారు.
‘‘బీఆర్ఎస్ హయాంలో అమలైన “సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్”ను అర్ధాంతరంగా బొందపెట్టి.. ఇప్పుడు కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టాలని మొరపెట్టుకోవడం విడ్డూరం.. హాస్యాస్పదం.. నాడు తెలంగాణలో విజయవంతంగా నడిచిన ఈ పథకం ఊపిరితీసి.. రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాలల్లోని లక్షలాది మంది విద్యార్థుల పొట్టగొట్టారు. ఇప్పటికే.. రైతుబంధు రద్దు చేశారు.. రైతుభీమాను రద్దుచేశారు. కేసీఆర్ కిట్ ను రద్దు చేశారు. న్యూట్రిషన్ కిట్ రద్దు చేశారు. చివరికి.. పిల్లల ఆకలి తీర్చే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కూడా ఆపేశారు. చిన్నారులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత చిన్నచూపు.
పేదల ఇళ్లల్లో ఉదయం అల్పాహారం ఉండదనే ఉద్దేశంతోనే విద్యార్ధుల కోసం బీఆర్ఎస్ హయాంలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు శ్రీకారం చుట్టాం.. ఉదయం ఇంట్లో ఏమీ తిని రాకపోవడం వల్ల విద్యార్థులు ప్రార్థన సమయంలోనే కళ్లు తిరిగి పడిపోయిన సంఘటనలు.. క్లాసుల మధ్యలోనే నీరసించిన సందర్భాలు కోకొల్లలు. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు.. పౌష్టికాహారం అందించాలన్న సమున్నతమైన ఆలోచన ఈ పథకం వెనక దాగి ఉందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించకపోవడం దురదృష్టకరం. పిల్లలే కాదు.. వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ పథకానికి సడెన్ గా బ్రేకులు వేసి.. ఇప్పుడు కేంద్రం తలుపు తట్టినంత మాత్రాన కాంగ్రెస్ సర్కారు చేసిన పాపం ఊరికే పోదు’’ అని కేటీఆర్ విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టు చేశారు.