KTR Vs Bandi sanjay : అవిశ్వాస తీర్మానం విషయంలో పార్లమెంట్ లో బండి సంజయ్ ప్రసంగం రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతల మద్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రసంగంలో బండి సంజయ్ ప్రధానంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కొన్ని ఘాటు పదాలను ఉపయోగించారు. దీనిపై ఉదయమే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ కూడా స్పందించారు. మీ గురించి దేశం మొత్తానికి తెలిసిపోయిదంని వణికిపోతున్నారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని దోచుకుని ఆస్తుల్ని పెంచుకున్న విషయం దగ్గర్నుంచి కాంగ్రెస్ తో కుమ్మక్కయిన అంశం వరకూ అందరికీ తెలిసిపోయిందన్నారు.
తెలంగాణలో కారును డబుల్ ఇంజిన్ సర్కార్ తొక్కేస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.