Konda Surekha controversial comments:  తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ నేతలు కేవలం మతపరమైన నినాదాలకే పరిమితమవుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వరంగల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, బీజేపీ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప.. రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏవి?" అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు.

Continues below advertisement

 హిందీ మాటలు.. కేవలం మీటింగులకే పరిమితమా? 

బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రం వద్ద నోరు విప్పడం లేదని సురేఖ విమర్శించారు.  బీజేపీ వాళ్లు కేవలం మీటింగులు పెట్టడం, జై శ్రీరామ్ అనడం తప్ప చేసేదేం లేదు. జై శ్రీరామ్ అంటే పైనుండి ఏమైనా పైసలు పడతాయా? లేక కొత్త పథకాలు వస్తాయా? మోదీ  తో మీటింగ్‌లు పెట్టిస్తారు.. నాలుగు హిందీ మాటలు మాట్లాడిస్తారు.. ఆ తర్వాత పంపేస్తారు. కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడి బీజేపీ మంత్రులు, ఎంపీలు నోరు మూసుకుని కూర్చొంటున్నారు  అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Continues below advertisement

 బీజేపీ నేతల ఫైర్! 

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. శ్రీరాముడి నామధేయాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని, ఇప్పుడు భక్తిని కూడా రాజకీయాల్లోకి లాగడం ఆమె అవివేకానికి నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   

 సోషల్ మీడియాలో ట్రోలింగ్  

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగడంలో తప్పులేదు  అని కొందరు ఆమెను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం భక్తికి, రాజకీయాలకు సంబంధం ఏంటి? నినాదాలను ఎగతాళి చేయడం తగదని అంటున్నారు.   కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుండి నిధుల విషయంలో బీజేపీని టార్గెట్ చేస్తుండగా, మరోవైపు బీజేపీ తన హిందుత్వ  అజెండాతో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది.