Andavelli Bridge : కొమురం భీం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అందవెల్లి పెద్దవాగుపై ఉన్న వంతెన కుంగిపోయింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై నుంచి ప్రమాదకరంగా పలువురు దాటి వెలుతుండటంతో వంతెనకు రెండు వైపులా అడ్డంగా గోడకట్టారు అధికారులు.


అసలేం జరిగింది? 


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జ్  కుంగిపోయింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. స్థానిక ఎమ్మార్వో ప్రమోద్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని ఇరువైపులా గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అందవెల్లి వంతెన కుంగిపోవడానికి అసలు కారణం ఇసుక దొంగలని, వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేసుకున్నారని, దీంతో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపించారు. 


42 గ్రామాలకు రాకపోకలు బంద్ 


వాగులో భారీ నీటి ప్రవాహానికి బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదముందని కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్ ఆరోపించారు. బ్రిడ్జ్ ను పరిశీలించిన ఆయన ఇది పూర్తిగా ప్రభుత్వం, ఇక్కడి నాయకుల నిర్లక్ష్యమేనన్నారు. గత సంవత్సరం నుంచి బ్రిడ్జ్ కుంగిపోతున్నా అధికారులు చూస్తూ కూర్చున్నారని, దీంతో దాదాపుగా 42 గ్రామాల ప్రజలు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిడ్జ్ పిల్లర్ కు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బ్రిడ్జ్ పై రహదారికి అడ్డంగా గోడలు కట్టి రాకపోకలు నిలిపివేశామని తహసీల్దార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వంతెన పిల్లర్ కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నందున రహదారిని మూసివేశామని ప్రజలు సహకరించాలని కోరారు. 


అధికారులు అప్రమత్తంగా ఉండండి 


తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్లు,  అధికారులకు సూచించారు. మంత్రి ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, జ‌న‌గామ జిల్లాల క‌లెక్టర్లు, సీపీ, ఎస్పీలు, పంచాయ‌తీరాజ్ శాఖ, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులతో సోమ‌వారం టెలీఫోన్ లో మాట్లాడి పరిస్థితుపై ఆరా తీశారు.  గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్తగా ఆ రోడ్డుపై తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. వరద నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  


Also Read : Revanth Reddy : తెలంగాణ జెండా, విగ్రహం, గీతం మార్చేస్తాం- రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


 Also Read : Bandi Sanjay : విద్యుత్ బిల్లులో మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తా- బండి సంజయ్ సవాల్