Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పార్టీపై అలిగారు. ఇటీవలి కాలంలో కీలక సమావేశాలకు హాజరు కావడం లేదు.  స్క్రీనింగ్‌ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. పార్టీలో ఇటీవల కీలక పదవులు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన స్వరం మార్చి ఆత్మగౌరవం ముఖ్యమని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీలో పదవి ఇచ్చారని. తనకు మాత్రం ఏ పదవి దక్కలేదని ఆయన అసంతృప్తికి గురయ్యారు. 


కోమటిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిన కేసీ వేణుగోపాల్                           


కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక గురించి తెలుసుకుని బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలతో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌ వస్తున్నానని  తనను కలవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి  మాణిక్‌రావు ఠాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. కోమటిరెడ్డితో మాట్లాడారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గదని.. సీనియర్ లీడర్ గా ఆయనకు ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  


పార్టీలో ప్రాధాన్యం దక్కదని హామీ ఇచ్చిన థాక్రే                             


రేవంత్‌రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు కోమటిరెడ్డి. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు  ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 


పదే పదే అసంతృప్తికి గురవుతున్న కోమటిరెడ్డి                                          


కోమటిరెడ్డి వ్యవహారం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతూనే ఉంది. ప్రతీ సందర్భంలోనూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ నేతలు బుజ్జగిస్తూనే ఉన్నారు. తర్వాత  కామ్ అవుతున్నారు. మళ్లీ ఏదో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్ ఆయనను సీనియర్ నేతగా గుర్తించింది కానీ.. ప్రత్యేకంగా ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనకు ఏదైనా పదవి ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.