Komatireddy :   తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బస్సు లేదా బైక్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.   గురువారం నాడు  కాంగ్రెస్ ఎంపీ    మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి, నల్గొండ,  మహబూబ్ నగర్,  ఖమ్మం జిల్లాల్లో యాత్ర  నిర్వహించనున్నట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. సమయం తక్కువగా  ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర  చేయాలా అనే విషయమై  ఆలోచిస్తున్నట్టుగా  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  తెలిపారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  తాము ఏం చేస్తామో  చెబుతామని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. యాత్రలో ఎవరినీ విమర్శించబోనన్నారు.     


హత్ సే హత్ జోడో  అభియాన్  కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ నేతలు  యాత్రలు నిర్వహిస్తున్నారు.  ఇందులో  భాగంగానే     నెల  6వ తేదీన మేడారం నుండి  రేవంత్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు.   ఇతర నేతలు  కూడా  పాదయాత్రలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  కోరారు.  ఇళ్లు, పార్టీ కార్యాలయాలను వదిలి ప్రజల్లోనే ఉండాలని కాంగ్రెస్ నేతలకు  సూచించారు  ఠాక్రే.ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు  నేతలంతా  కలిసికట్టుగా  పనిచేయాలని  పార్టీ నాయకత్వం  కోరింది.    


రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీపై కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ భవన్ కు రానని సవాల్ చేశారు. అయితే కొద్ది రోజుల కిందట.. కొత్త ఇంచార్జ్ మామిక్ రావ్ ధాక్రే నియామకం తర్వాత అనూహ్యంగా గాంధీ భవన్కువచ్చారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.  ఇద్దరి మధ్య కొంత కాలంగా సాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుమ ఈ ఇద్దరి సడన్ కలయిక పార్టీలో ఆసక్తిగా మారింది.  తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు థాక్రే ప్రయత్నిస్తున్నారు..  నేతలతో వరుస భేటీ నిర్వహించి.. అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన... హాత్ సే హాత్ జోడో అభియాన్  పాదయాత్రల పై అందరికీ హక్కు ఇచ్చారు. సీనియర్లు నాలుగైదు జిల్లాల్లోపాదయాత్ర చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు.    


ఇటీవల కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నకిరేకల్ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి.  పోస్టర్ల అంశంపై కోమటిరెడ్డి హైకమాండ్‌కు కంప్లయింట్ చేసినట్టు సమాచారం. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నా కూడా తనపై కోవర్టు ముద్ర వేస్తున్నారని కోమటిరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగాతెలుస్తోంది.   రేవంత్‌ సూచనల మేరకు వ్యూహకర్త సునీల్‌ కనుగోలు బృందం నేతృత్వంలోనే ఈ పోస్టర్ల ముద్రణ జరిగిందని వెంకట్ రెడ్డి అనుమానిస్తున్నారు. కోమటిరెడ్డి పీసీసీ కమిటీల్లో తన వర్గీయులను నియమించేలా అధిష్టానం వద్ద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పీసీసీ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అయినా లేదా కొత్తగా విస్తరించి అయినా తన వర్గీయులకు స్థానం కల్పించాలని ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.