Komatireddy Venkata Reddy On Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ను "చిన్నపిల్లోడు", "అవగాహన లేనివాడు" అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తనకు ఆసక్తి లేదని.. లోకేష్ అలా మాట్లాడినట్లుగా తెలియగానే తనకు నవ్వు వచ్చిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడతామని కోమటిరెడ్డి తెలిపారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో కోమిటరెడ్డి మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో "చాప్టర్ క్లోజ్" అని, దీనిని అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన విషయం అందరికీ తెలుసునని, ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంపై కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా స్పందించారు. తన ఫోన్ నంబర్ ఎప్పటినుంచో ఒకటే ఉందని, దాన్ని మార్చలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఏం జరగాలో అది జరుగుతుందని వ్యాఖ్యానించారు. తన ఫోన్ ట్యాప్ అవలేదని అనుకుంటున్నానన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఐదు గ్రూపులు ఉన్నాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ గ్రూపులు ఉన్నాయన్నారు. ఈ పార్టీ భవిష్యత్తులో ఉనికిలో ఉండదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడడం వృథా అని అన్నారు. కవిత బీసీల గురించి మాట్లాడటంపై విమర్శిస్తూ, గత పదేళ్లలో ఆమెకు బీసీలు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో... మొదటి ఏడాది నేను బాధపడ్డాననని.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఆనందంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమేనని.. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లను ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నీ కలుస్తున్నానని.. గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఫోర్త్ సిటీ కలపాలని సీఎం చెప్పారన్నారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామన్నారు.
డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువల లైనింగ్ ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద 100 ఎకరాలు ఉన్నవారికి కూడా సాయం అందించామని చెప్పారు. ఎంజీ యూనివర్సిటీలో కొత్త భవనాల నిర్మాణం, నార్కెట్‌పల్లి పెద్ద చెరువును వేణుగోపాలస్వామి పేరుతో మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడం, క్యాంపు కార్యాలయానికి "ఇందిరా భవన్"గా నామకరణం చేశామన్నారు.