Komatireddy Reverse : వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుంది బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ తో కలవడం తప్ప మరో ఆప్షన్ లేదని ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ కు వచ్చే సరికి మాట మార్చారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని.. పొత్తుల అంశంపై తాను అన్న మాటు కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలనే తాను చెప్పానన్నారు. తానేం తప్పు చేయలేదని..తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేయవద్దని ఆయన మీడియాను కోరారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయాన్ని సోషల్ మీడియా సర్వేల ఆధారంగా చేసుకుని మాట్లాడానన్నారు. మీడియానే తన మాటల్ని వక్రీకరించిందన్నారు. సెక్యూలర్ పార్టీతోనే పొత్తు అని చెప్పానని.. బీజేపీ ఈ విషయాన్ని రాజకీయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడుతున్నారని.. ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది మాత్రమే తాను చెప్పానన్నారు. కాంగ్రెస్ సీట్లపై వ్యాఖ్యలు తన వ్యక్దిగతమని కోమటిరెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.
ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కోమటిరె్డిడతో మాట్లాడిన థాక్రే
ఢిల్లీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే కూడా వచ్చారు. ఎయిర్ పోర్టు లాంజ్‌లోనే దాదాపుగా ఇరవై నిమిషాల సేపు కోమటిరెడ్డితో థాక్రే సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. కొంత మంది ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ... థాక్రేకు వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తాను సాధారణంగానే కామెంట్స్ చేశానని కానీ వాటిని కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు కూడా వివాదాస్పదం చేశారని వివరించినట్లుగా చెబుతున్నారు. తాను పొత్తులపై బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని.. సెక్యూలర్ పార్టీలతో మాత్రమే పొత్తులు ఉంటాయన్న రాహుల్ గాంధీ మాటలనే చెప్పానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు వినలేదు.. చూడలేదన్న భట్టి, రేవంత్, థాక్రే
మరో వైపు ఈ అంశంపై మాణిక్ రావు థాక్రేను కూడా మీడియా ప్రశ్నించింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో పూర్తిగా వినలేదని.. ఆయన స్టేట్ మెంట్‌ను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని చెప్పి వెళ్లిపోయారు. పాదయాత్రలో ఉన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. పార్టీకి ఇబ్బందికరమైన కామెంట్లు చేస్తే పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మల్లు భ ట్టి విక్రమార్క కూడా ఇదే విధంగా స్పందించారు. కోమటిరెడ్డి కామెంట్స్ తాను వినలేదు.. చూడలేదని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో కోమటిరెడ్డి ఏమన్నారంటే ?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావు. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం అవుతుంది. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా... ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది . కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య . ఇప్పుడిప్పుడే పార్టీ ఓ దారిలోకి వస్తోంది. సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలి.. అలా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో నలభై నుంచి యాభై స్థానాలు గెలుచుకుంటుంది. ఏదైనా మిరాకిల్ జరిగేతే తప్ప కాంగ్రెస్‌కు అంతకు మించిన మెజార్టీ రాదు.