Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 08 Aug 2022 07:56 PM
యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా 

UGC-NET సెకండ్ ఫేజ్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 20-30 తేదీల మధ్య నిర్వహిస్తామని UGC ఛైర్మన్ జగదీష్ కుమార్ ప్రకటించారు. 

తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష తేదీ మార్పు 

Constable Exam : తెలంగాణలో కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీ మారింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వాయిదా వేసింది. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. 

PV Sindhu Wins Gold AT CWG 2022: స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు, మూడో ప్రయత్నంలో సక్సెస్

PV Sindhu Wins Gold: తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది! అశేష భారతావనిని మరోసారి మురిపించింది. బర్మింగ్‌హామ్‌లో తన రాకెట్‌ పవర్‌ చూపించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో విలువైన స్వర్ణ పతకం ముద్దాడింది. ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌, కెనడా షట్లర్‌ మిచెల్‌ లీని 21-15, 21-13 తేడాతో చిత్తు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం. ఈ ఏడాది వీరిద్దరూ రెండు సార్లు తలపడగా రెండుసార్లూ తెలుగమ్మాయినే విజయం వరించింది.

78 శాతం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ

78 శాతం పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు అని పోలవరం రౌండ్ టేబుల్ సమావేశము లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ అన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టలేదని, కనుక ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తాం అన్నారు.


      

TTD Retired Employee Murder: టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగి దారుణ హత్య, చోరీ కేసు ఫిర్యాదే కారణమా

తిరుపతి : తిరుపతిలో టీటీడీ రిటైర్ట్‌ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని ఎంఆర్‌ పలెల్లో ఆదివారం అర్ధరాత్రి నారాయణస్వామిని దుండగులు కొట్టి హత్య చేశారు. తన గోల్డ్‌చైన్‌ పోయిందని ఇటీవల స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో నారాయణస్వామి  మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నారాయణస్వామి ఇంటిపక్కన ఉండేవారిని ప్రశ్ని స్తున్న సమయంలో ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురికావడం సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Bike Catches Fire in Chennoor: చెన్నూర్‌లో మంటలు చెలరేగి బైక్ దగ్దం

మంటలు చెలరేగి బైక్ దగ్దం


ద్విచక్ర వాహనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన సంపత్ అనే వ్యక్తి సొంత పనుల నిమిత్తం చెన్నూర్ కి వచ్చాడు. పాత బస్టాండ్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు తన HF డీలక్స్ వాహనం పక్కకు నిలిపాడు. కూరగాయలు కొని బండి స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సంపత్ పక్కకు పరుగులు తీశాడు. ఒక్కసారిగా ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు.
దీంతో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ తోనే వాహనం కాలిపోయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గమనించిన స్థానికుల్లో కొందరు మంటలను ఆర్పేశారు.  

Flood Water To Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 
జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి  
ఇన్ ఫ్లో : 1,23,942 క్యూసెక్కులు   ఔట్ ఫ్లో : 1,46,593 క్యూసెక్కులు 
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు  
ప్రస్తుతం  : 884.40 అడుగులు 
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు 
ప్రస్తుతం : 212.4385 టీఎంసీలు


 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఓంకార్, సినీ‌హీరో అశ్విన్

తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో‌ ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్, సినీ‌హీరో అశ్విన్ లు కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ వైకుంఠ నాధుడిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు.. ఆహాకి డ్యాన్స్ ఐకాన్ అనే డ్యాన్స్ షో చేస్తున్నాని, ఈ‌నెల చివరికి ఈ ప్రోగ్రాం ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఓంకార్ చెప్పారు..నా తమ్ముడు అశ్విన్ నూతన సినిమా హిడుంబా టీజర్ రిలీజ్ చేయడం జరిగిందని, త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది‌ ప్రకటించారు.. ఇక హాట్ స్టార్ కి వెబ్ సిరిస్ చేస్తున్నాని,అందరూ శ్రీనివాసుడి ఆశీస్సులతో బాగుండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.. అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిడుంబా చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు..

KomatiReddy Rajgopal Reddy Resignation: రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించిన రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. 





Background

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ర్యాంకు కార్డులను అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆదివారం ప్రొవిజనల్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు విడుదల చేసింది. జులై 25 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా..  మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీలోని కోస్తాంధ్ర తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. నేటి రాత్రిగానీ, రేపటిలోగా ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, ఢిల్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆగస్టు నెలలో పెరిగాయి. ఆగస్టు ప్రారంభంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,380 కాగా, నేడు రూ.51,870కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్టు 1న రూ.47,100 కాగా, నేడు రూ.47,550 అయింది. హైదరాబాద్ వెండి 1 కేజీ ధర నేడు రూ.63,000గా ఉంది. అంటే ఈ ఆగస్టు తొలి వారంలో వెండి ధర రూ.300 మేర పెరిగింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.51,870 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550కు చేరింది. వెండి కేజీ ధర రూ.63,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. 
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550 గా ఉంది. నేడు విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.63,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


హైదరాబాద్‌లో చాలా రోజుల నుంచి  ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆగస్టు 08 (సోమవారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 08 August 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 


విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్‌ లీటర్ ధర రూ.111.53 కాగా, 30 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.30 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధర నిలకడగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్‌ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో 20 పైసలు దిగొచ్చి పెట్రోల్ లీటర్ రూ.112.35 కాగా, డీజిల్ ధర 18 పైసలు తగ్గి లీటర్ ధర రూ.100.01 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 24 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.112.27 కాగా, డీజిల్ ధర రూ. 99.96 అయింది. నెల్లూరులో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. డీజిల్ ధర రూ.98.90 అయింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.