Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి సోదరులు కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై.. ఎంపీ వెంకటరెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి అంటే  నిజాయితీకి మారు పేరు అని..  కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అన్నారు.  కాదనే ధైర్యం ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.  ‘‘మీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు. నా జోలికి వస్తే మీ చిట్టా విప్పుతా. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్‌ కేటీఆర్? ’’ అంటూ ప్రశ్నించారు.  తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.  


కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీ మారుతాడని ఇటీవల జోస్యం చెప్పిన కేటీఆర్ 


ఇటీవల కేటీఆర్ కోమటిరెడ్డి సోదరులను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ తపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వెంకటరెడ్డిని కూడా కలిపి కేటీఆర్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి పోతారని చెప్పారు. ఈ అంశంపై కోమటిరెడ్డి స్పందించారు. తన గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. అయితే  మళ్లీ కోమటిరెడ్డి సోదరను కోవర్ట్ రెడ్డి సోదరులను సంబోధించడంతో మరోసారి కాక రేగినట్లయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిబీజేపీ కోసం పని చేస్తారన్న కారణంగా కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. 


సొంత పార్టీ నేతలు తిట్టిన బాధతోనే మునుగోడులో ప్రచారానికి పోవడం లేదన్న కోమటిరెడ్డి 


అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని..  కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. మరి మునుగోడుకు ఎందుకు ప్రచారానికి పోవడం లేదన్న అంశంపై మాత్రం ఆయన భిన్నంగా స్పందించారు.  సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే నేను ప్రచారానికి వెళ్లడం లేదని  చెబుతున్నారు. ఏ ముఖంపెట్టుకుని మునుగోడ ప్రచారానికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన ఆశీస్సులు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికే ఉంటాయని చెబుతున్నారు. మరో వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ తరపున ప్రచారానికి వస్తారని ఆయన చెబుతున్నారు. 


విదేశీ పర్యటనకు వెళ్లి ..ఎన్నిక పూర్తయిన తర్వాతే తిరిగి రానున్న కోమటిరెడ్డి 


అయితే కోమటిరెడ్డి మాత్రం రెండు రోజుల్లో కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కుటుంబంతో వ్యక్తిగత పర్యటనపై ఆస్ట్రేలియాకు వెళ్తున్నానని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక పూర్తయిన తర్వాతనే ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆయన ఉపఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేసే అవకాశం కనిపించడం లేదు.  విదేశీ పర్యటన నా వ్యక్తిగతం, నాపై కేటీఆర్‌ చేసిన కోవర్ట్‌ కామెంట్స్‌ విత్‌ డ్రా చేసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.