Harish Rao in Siddipet: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అతి త్వరలోనే మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ప్రైవేటు ఆస్పత్రులు మినహా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైందని గుర్తు చేశారు. మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న రోగులను మంత్రి హరీశ్ రావు సోమవారం (మే 3) పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు అక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆస్పత్రిలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేస్తామని అన్నారు. పేదవారు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే మోకాలి చిప్పల మార్పిడి తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్పత్రుల్లోనూ పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లలో 30 శాతం ప్రసవాలు అయితే ఇప్పుడు 56 శాతం అవుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే ఆస్పత్రిలో ఎక్కువగా సర్జరీలు అవుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.
వేముల వాడలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన
వేములవాడ రాజన్నను మంగళవారం మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు. స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తుల ఇబ్బందులను ముఖ్యమంత్రి స్వయంగా చూశారని అన్నారు. అందుకే సీఎం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించారని అన్నారు.
అందుకోసం ముడి చెరువులో 35 ఎకరాలు ఇప్పటికే సేకరణ పూర్తయిందని మంత్రి తెలిపారు. బద్ది పోచమ్మ ఆలయం విస్తరణకు సైతం భూసేకరణ కూడా పూర్తి చేశారని అన్నారు. యాదాద్రి ఆలయంలాగానే సీఎం కేసీఆర్ వేములవాడ, కొండగట్టు ధర్మపురి, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తారని చేస్తారని మంత్రి తెలిపారు.