KLH University Ranked 22nd In NIRF: కేఎల్‌హెచ్ యూనివర్శిటీ (KLH University) రికార్డు సృష్టించింది. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎన్ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో 22వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని కేఎల్ డీమ్డ్ వర్శిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారధి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అద్భుతమైన విజయం సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
'నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ - 2024లో తమ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ పని తీరు కనబరిచినందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకు ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకుల్లో కేఎల్‌హెచ్ యూనివర్శిటీ 22వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనత దేశంలో విశ్వ విద్యాలయాలు, అకడమిక్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా అన్ని వర్శిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, ఎన్ఐటీలు మొత్తం కలిపి 6,517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో మా యూనివర్శిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయాలు కేఎల్‌హెచ్ వర్శిటీ సమగ్ర విద్యా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ మొత్తం మీద మా క్యాంపస్ అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకోవడం గర్వకారణం.' అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, వర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అటు, అజీజ్ నగర్, బోరంపేట, కొండాపూర్ క్యాంపస్‌ల్లో అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు.
Also Read: Warangal News: వాగు మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు - రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు, చివరకు!