నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తున్న స్థానిక బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంఘీబావం తెలిపారు. నిమ్మరసం తాగించి ఆయన దీక్షను విరమింపజేశారు. సోమవారం (ఆగస్టు 21) కిషన్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకోవడం, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి 3 గంటల సమయంలో పోలీసులు మహేశ్వర్ రెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో కార్యకర్తలకు మద్య తోపులాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.


అనంతరం లాఠీ ఛార్జ్ లో గాయాల పాలైన పలువురు కార్యకర్తలను, రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన తెలంగాణ వ్యాప్తంగా తెలిసిందేనన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి బీజేపీ శ్రేణులు తెలంగాణకు ఆదర్శమన్నారు. మంత్రి తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట నిర్మల్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. రైతుల భూములతో వ్యాపారం చేయడానికే ఈ 220 జీవో తీసుకువచ్చారన్నారు. ఏ అధికారులు ఈ 220 జీవో ఇచ్చారో వారితోనే ఈ జీవోను రద్దు చేయించే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. 


రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధరణి పేరుతో ఈ ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కొందని.. ముఖ్యంగా ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందన్నారు. ధరణిలో నష్టపోయిన రైతు ఆత్మహత్యలన్నీ.. ప్రభుత్వ హత్యలేననీ, మజ్లీస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మ అని అన్నారు. నిర్మల్ లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఏ హక్కుతో మంత్రి కుటుంబ సభ్యుల పేరుమీద అప్ప చెప్పిందనీ, బడా వ్యాపారుల కోసమే కేసీఆర్ ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారని అన్నారు. 


కల్వకుంట్ల కుటుంబం రియల్ ఎస్టేట్ లకు బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో తెలపాలని అన్నారు. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇలా అన్ని మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ నెల 27వ తేదీన రైతు భరోసా పేరిట ఖమ్మంలో బహిరంగ సభకు, ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరు కానున్నారని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపు ఇచ్చారు. 


నిర్మల్ ప్రజలు, అమర వీరులు కోమురం భీం, రాంజీ గోండు పోరాట స్పూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగుర వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్య, పడకంటి రమాదేవి, అల్జాపూర్ శ్రీనివాస్, రాథోడ్ రమేష్, చిట్యాల సుహాసిని రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మేడిసెమ్మ రాజు, నాయుడి మురళి, వొడిసెల అర్జున్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.