Rajasingh :  రాజాసింగ్ పై హైకమాండ్ సస్పెన్షన్ ఎత్తివేస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారని టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రాజాసింగ్ విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటో బీజేపీ నేతలకూ అర్థం కావడం లేదు. మరో వైపు రాజాసింగ్ ఎన్నికలకు సిద్ధం కావాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. తానే పోటీ చేస్తానని మొదటి జాబితాలోనే తన పేరు ఉంటుందని రాజాసింగ్ చెబుతున్నారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. 


బీజేపీ టిక్కెట్ విక్రమ్ గౌడ్‌కని ప్రచారం                 


గోషామహల్   నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ముఖేశ్​ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన ఇప్పటికే ఓటర్లను కలుస్తూ.. ప్రచారం కూడా ప్రారంభించారు.  టికెట్ తనకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ముఖేశ్​ గౌడ్  సొంత సెగ్మెంట్ అయిన గోషామహల్ లోనే విక్రంగౌడ్ పాగా వేయాలనుకుంటున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీలో కొంత మంది ముఖ్య నేతల మద్దతు ఉందని  చెబుతున్నారు.   కిషన్ రెడ్డికి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితుడిగా పేరున్న విక్రం గౌడ్ టికెట్ తనకే వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


రాజాసింగ్‌కు దక్కని భరోసా                   


వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారుఖీ షోకు తెలంగామ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, మహమ్మద్ ప్రవక్త పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ ను నమోదు చేసి జైలుకు పంపారు.  ఆ వెంటనే  రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ  ప్రకటించింది. బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగిన  సమయంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు.   
  
రాజాసింగ్ ప్రయత్నం ఫలిస్తుందా..?              


తాను సెక్యులర్ పార్టీల్లో చేరబోనని, బీజేపీ కమలం గుర్తుపైనే పోటీ చేస్తానని, తన సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ టికెట్ రాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇతర పార్టీల తరఫున పోటీ చేయబోనని అంటున్నారు.  ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశం అధిష్టానం పరిధిలో ఉందని, సస్పెన్షన్ ఎత్తివేస్తే టికెట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజాసింగ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అగ్రనేతల ద్వారా సస్పెన్షన్ ఎత్తివేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలిస్తాయో లేదో కానీ.. రాజాసింగ్  మాత్రం పోటీ ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.