Central Ministers Performance Kishan Reddy Top: కేంద్ర ప్రభుత్వంలో తెలుగు నేతలు తమదైన ముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మంత్రుల జాబితాలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధికారికంగా విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో కిషన్ రెడ్డి కి ప్రథమ స్థానం దక్కింది. మంత్రుల పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్ వేగం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలతో అనుసంధానం వంటి కీలక అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించారు.
పనితీరుకు నిదర్శనం ఈ ర్యాంక్
బొగ్గు , గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కిషన్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. శాఖాపరమైన నిర్ణయాల్లో వేగం పెంచడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరించడం ద్వారా పాలనలో పారదర్శకతను పెంచారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడంలో ఆయన చూపిన చొరవను కేంద్రం గుర్తించింది. ఈ ర్యాంకింగ్స్‌లో కిషన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా టాప్ పెర్ఫార్మర్ల జాబితాలో నిలిచారు.
విష్ణువర్ధన్ రెడ్డి అభినందనలు
కిషన్ రెడ్డి గారికి అగ్రస్థానం దక్కడంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత, జాతీయ కౌన్సిల్ సభ్యుడు యస్. విష్ణువర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి గారి నిబద్ధత, నిజాయితీ వల్లే ఈ గుర్తింపు లభించిందని, ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మోదీ గారి టీంలో నంబర్ వన్ మంత్రిగా నిలవడం ఆయన సమర్థతకు నిదర్శనమని కొనియాడారు.
రిపోర్టులోని ముఖ్యాంశాలు
ఈ రిపోర్టు ప్రధానంగా డిజిటల్ ఫైల్ మూవ్‌మెంట్, క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, మినిస్ట్రీ అవుట్‌పుట్ ఆధారంగా రూపొందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే తన శాఖను దేశంలోనే ముందంజలో ఉంచిన కిషన్ రెడ్డి గారిపై రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
