Kishan Reddy On VB G RAM G : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' VB-G RAM G యాక్ట్-2025 పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ చట్టం కేవలం గుంతలు తవ్వే పథకం కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి కుటుంబానికి అదనపు ఆదాయం కల్పించేలా రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకంలో టెక్నాలజీని జోడించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచామని, గతంలో ఉన్న అవినీతిని అరికట్టేందుకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేసేలా డిజిటల్ విధానాన్ని పటిష్టం చేశామని తెలిపారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని, గత అనుభవాల దృష్ట్యా పేదలకు మరింత మేలు చేసేందుకే ఈ మార్పులు తెచ్చామని పేర్కొన్నారు.
ఈ నూతన చట్టం ద్వారా కూలీలకు పక్కాగా హక్కులు కల్పిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. పని అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలని, అలాగే వేతనాలు ఆలస్యమైతే రోజుకు 5 శాతం చొప్పున జరిమానా విధించేలా కఠిన నిబంధనలు తెచ్చామని చెప్పారు. పథకం అమలులో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనుల సీజన్‌లో ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించామని స్పష్టం చేశారు. పథకం పర్యవేక్షణ కోసం అడ్మినిస్ట్రేషన్ నిధులను 9 శాతానికి పెంచి, జియో-ట్యాగింగ్ ద్వారా పనుల్లో పారదర్శకతను పెంచుతున్నట్లు వివరించారు.
నిధుల కేటాయింపు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రూ. 17 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాది కంటే సుమారు రూ. 340 కోట్లు అదనంగా నిధులు అందబోతున్నాయని గణాంకాలతో సహా వివరించారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం–రాష్ట్రాలు భాగస్వాములుగా పనిచేస్తేనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటోందన్న విమర్శల్లో వాస్తవం లేదని హితవు పలికారు. పథకాల పేర్ల మార్పు ముఖ్యం కాదని, అవి పేదలకు నిజంగా ఉపయోగపడుతున్నాయా లేదా అన్నదే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం సుస్థిరమని, వరుసగా మూడోసారి అధికారంలోకి రావడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో చట్టపరమైన పరిమితులు ఉన్నాయని, అయితే ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దక్కిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిరంతరం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.