Anantha Padmanabha Swamy temple in Vikarabad: వికారాబాద్: జిల్లాలోని పర్యాటక కేంద్రం అనంతగిరికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కోటిపల్లిని సోమవారం కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అక్కడ బోటింగ్ చేశారు. పర్యాటక రంగానికి భారత్ (India) లో ఎంతో అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ టూరిజం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పెట్టుబడులు రావాలని అభిప్రాయపడ్డారు. 


పీఎం జన్మన్ పథకం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరు చైతన్య నగర్ లో పీఎం జన్మన్ పథకం ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన జీవితాలలో నిజమైన క్రాంతి ఈ సంక్రాంతే అన్నారు. గిరిజన గ్రామాలలో అన్ని మౌలిక వసతుల కల్పననే పీఎం జన్మన్ ఉద్దేశమన్నారు. గత 15వ తేదీన క్యాబినెట్ లో జన్మన్ పై  ప్రణాళికలు సిద్ధం చేశారు. 75 సంవత్సరాలుగా కనీస వసతులు లేని గిరిజన గ్రామాలను.. నేటి నుంచి జన్మాన్ పథకం ద్వారా గిరిజన గ్రామాలలో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. 


 
దేశంలో 18 రాష్ట్రాలలో 22 వేల గ్రామాలలో జన్మాన్ పథకం అమలు కానుంది. ప్రతి గ్రామంలో ఆధార్, రేషన్ జననా,మరణ ధ్రువపత్రాలు విద్యుదీకరణ మీటర్లు, 11రకాల మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. 503 గ్రామాలలో మొబైల్ టవర్లు ఏర్పాట్లు, 300 అంగన్వాడీ కేంద్రాలు, 84 వేల ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయనున్నారు. వాటి ద్వారా తెలంగాణలో 468 గ్రామాలలో 55 వేల మందికి లబ్ది చేకూరనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 






పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలి. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ కు 100 కోట్ల రూపాయలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. స్వదేశీ దర్శన్ పేరిట అనంతగిరి పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి కోసం బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.