Kishan Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు స్పీడు పెంచాయి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే బీజేపీ ఈరోజు ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో బేజీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మన ఉద్యోగాలు మనకే అని చెబుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటికీ వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారని... మొత్తం 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారని గుర్తు చేశారు. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తూ... సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






పేపర్ లీకేజీలపై పోరాడితే బండి సంజయ్ అరెస్ట్


పేపర్ లీకేజీలపై పోరాడితే బండి సంజయ్ పై కేసులు పెట్టడం దారుణం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేతకాని తనం వల్లే పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగాయన్నారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని.. అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. వాటాలు ఇస్తే తప్ప ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడం లేదన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేరని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ధ్వజమెత్తారు.