MLA Rekha Naik likely to Quit BRS: అధికార పార్టీ బీఆర్ఎస్ లో అసమ్మతి మొదలైంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీలు మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖానాపూర్ లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ వీడనున్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనైన ఆయన అధికార పార్టీకి గుడ్ బై చెప్పన్నుట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త భర్త శ్యామ్ నాయక్ సోమవారం రాత్రి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి రేఖా నాయక్ భర్తను పార్టీకి ఆహ్వానించారు.
రేపు కాంగ్రెస్ లో చేరనున్న రేఖా నాయక్!
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడతగా 115 అభ్యర్థులతో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఖానాపూర్ నుంచి రెండుసార్లు బీఆర్ఎస్ తరపున విజయం సాధించిన రేఖానాయక్ కు ఈసారి కేసీఆర్ మొండిచేయి చూపారు. తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త సోమవారం కాంగ్రెస్ లో చేరగా, త్వరలో ఎమ్మెల్యే రేఖా నాయకు హస్తం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
ఖానాపూర్ నియోజకవర్గంలోకొంత కాలంగా పని చేసుకుంటున్న మంత్రి కేటీఆర్ స్నేహితుడు, ఎన్నారై జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. మరోవైపు రేఖా నాయక్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారని.. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలనూ దూరం చేసుకున్నారని ప్రచారంలో ఉంది. ఈ ఎన్నికల్లో రేఖా నాయక్ కు టికెట్ ఇచ్చినా ఫలితం లేదని సీఎం కేసీఆర్ ఆమెకు టిక్కెట్ నిరాకరించిందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వేములవాడ, వైరా, మెట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు. చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం సమస్య ఉందని, మరోచోట తండ్రి అనారోగ్యం కారణంగా కుమారుడికి సీటు ఇవ్వాలని కుటుంబం చెప్పడంతో సిట్టింగ్ లకు సీట్లు రాలేదన్నారు. కానీ రేఖా నాయక్ పరిస్థితి అలా కాదు. రెండు సార్లు ప్రత్యర్థి పార్టీ నేతలపై భారీ మెజార్టీతో బీఆర్ఎస్ కు విజయాన్ని అందించారు. నియోజకవర్గంలో కొన్ని వివాదాలు, వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా చేయడం స్థానికంగా ప్రజల్లో ఆమెపై అసంతృప్తి ఉందన్నది కొంత వాస్తవం. కానీ పార్టీ కోసం పాటుపడిన తనను టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఆమె భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
రేఖా నాయక్ పొలిటికల్ కెరీర్..
అజ్మీరా రేఖ నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్.పి.టి.సి. మెంబర్ గా పోటీచేసి విజయం సాధించారు. 2013లో బీఆర్ఎస్ ( అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి)లో చేరి, ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారితో విజయం సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలిచారు.