Khammam Politics :  ఖమ్మం బీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దమ్ముంటే రాజీనామా చేయమని మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ చేస్తూంటే.. అదే దమ్ము ఉంటే..తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేత‌లంతా త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి అని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చరించారు.  బీఆర్ఎస్‌లో ఉన్న వారంతా కేసీఆర్‌కు విధేయులే. నా బ్రాండ్ నా గ్రూప్ అంటే కుద‌ర‌దు అని పువ్వాడ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.. పొంగులేటి లాంటి వ్య‌క్తుల‌ను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారు. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని 2009లో చీల్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడే కేసీఆర్ చ‌లించ‌లేదన్నారు. 


కేసీఆర్ నీడ నుంచి వెళ్లిన వారికి రాజకీయ జీవితం లేకుండా పోయింది. కేసీఆర్ త‌యారు చేసిన నాయ‌కులు చాలా పెద్ద‌వాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ చేయి వ‌దిలేస్తే వారి గ‌తి అధోగ‌తే అని హెచ్చ‌రించారు. కొంద‌రు పార్టీలు కూడా పెట్టారు. ఆ పార్టీలు పాన్‌డ‌బ్బాలుగా మారిపోయాయ‌ని విమ‌ర్శించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, తెలంగాణ‌లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ మాత్ర‌మే జాతీయ పార్టీల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డాయి. మిగ‌తా పార్టీల‌న్నీ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌ని పువ్వాడ అజ‌య్ కుమార్ గుర్తు చేశారు.వైరాలో బీఆర్ఎస్ ఎట్ల గెల‌వ‌దో తాను చూస్తాన‌ని చెప్పారు. గ్రూపు రాజ‌కీయాలు మంచివి కావు. కేసీఆర్ఎవ‌రికీ అన్యాయం చేయ‌కుండా అంద‌రికీ ప‌ద‌వులు ఇచ్చారు. 


మూడు రోజుల కిందట పొంగులేటిని కలిశారన్న కారణంతో పలువురు బీఆర్ఎస్ నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై పొంగులేటి మండిపడ్డారు.  ‘నా వాళ్లను కాదు, ధైర్యముంటే నన్ను సస్పెండ్​ చేయండి.. అదీ మీ ఖలేజా’ అంటూ బీఆర్ఎస్​ లీడర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సవాల్​ విసిరారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో నా ఫొటో వాడలేదా, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదా, మీ ఎన్నికలకు నన్ను ఉపయోగించుకోలేదా? అవన్నీ మర్చిపోయారా’ అని ప్రశ్నించారు. తన వెంట ఉన్నవారిని సస్పెండ్​ చేసే  స్థాయి వారికి ఉందో, లేదో తెలుసుకోవాలన్నారు.  


పొంగులేటి బీఆర్ఎస్​ నుంచి బయటకు పోవడం కన్ఫామ్ అయినా, ఇప్పటివరకు ఆయన ఏ పార్టీలో చేరబోయేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  బీజేపీ, కాంగ్రెస్​, వైఎస్​ఆర్​టీపీ నుంచి ఆహ్వానాలున్నా పొంగులేటి తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే ఉమ్మడి జిల్లాలో తన అనుచరులందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజే ఆయన చెప్పారు. దాని ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.  వైరా అభ్యర్థిగా బానోత్​ విజయను ఇప్పటికే ప్రకటించిన పొంగులేటి.. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి జారే ఆది నారాయణ పేరును ప్రకటించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులే ఉంటారని  ఆయన అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి క్యాడర్ బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు.