Khammam Latest News: మున్నేరు నదికి మళ్లీ వరద ప్రారంభం అయింది. ఇప్పటికే గత రాత్రి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుండగా.. మున్నేరు నది వెంట నివసించే ప్రజలకు అధికార యంత్రాంగం బిగ్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దన్వాయి గూడెం, రమణపేట్, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర నగర్ నుంచి ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. వారు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సెంటర్లలోకి వెళ్లాలని సూచించింది.


రెస్క్యూ కేంద్రాలు మహిళా డిగ్రీ కళాశాల, స్వర్ణ భారతి ఫంక్షన్ హాల్, చర్చి కాంపౌండ్ - రమణపేట హైస్కూల్, దామసలాపురం స్కూల్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబరు 1077కు కాల్ చేయాలని సూచించారు.










రోడ్లన్నీ బ్లాక్ - కలెక్టర్ ఆదేశాలు


ఖమ్మం జిల్లాలోని మున్నేరు నదికి ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతంలో డేంజర్‌ జోన్‌ గా ప్రకటించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్లనే మున్నేరు పొంగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.