Khammam News: ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. ఇవి మామూలు పెళ్లిళ్లు కాదండోయ్‌.. కోట్లాది రూపాయలు వెచ్చించి బాహుబలి రేంజ్‌లో చేస్తున్న సెట్టింగ్‌లు.. ఇదంతా ఒక రేంజ్‌ అయితే మరి రిసెప్షన్‌ కోసం దారి కోసం రూ.కోటి వెచ్చించి ఒక బ్రిడ్జిని నిర్మించారంటే పెళ్లి రిసెప్షన్‌ వేడుక ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతల ఇళ్లలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. ఎవరికి వారే అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు భారీగా ఖర్చు చేయడం, నెల రోజులుగా ఆహ్వానాలు, పెళ్లి గిప్ట్‌ల పేరుతో వాచీల పంపిణీ చేయడంతో ఇప్పుడు ఈ రెండు పెళ్లిళ్ల మీద జనం దృష్టి పడింది. 


ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తె స్వప్ని రెడ్డి రిసెప్షన్‌ ఈ నెల 17న ఖమ్మంలో నిర్వహించనున్నారు. అత్యంత భారీగా ఈ వివాహ రిసెప్షన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివాహ పత్రికలతోపాటు ప్రతి ఒక్కరికి గోడ గడియారాలు బహుకరించిన ఎంపీ పొంగులేటి, ఇప్పుడు రిసెప్షన్‌ వేడుక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్తు తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తనయుడు పువ్వాడ నయన్‌ రాజ్‌ వివాహం ఈ నెల 20 న జరగనుంది. ఈ వివాహానాకి సైతం గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


కోటి రూపాయలతో ఏకంగా బ్రిడ్జి నిర్మాణం..
పొంగులేటి తన కుమార్తె స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్‌ను ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ వేదిక వద్దకు వెళ్లే మార్గంలో నాగార్జున సాగర్‌ డీప్‌ కట్‌ ఉంది. వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా ఈ కెనాల్‌పై రూ.కోటి వ్యయంతో అత్యవసరంగా బ్రిడ్జిని నిర్మాణం చేశారు. ఐరన్‌తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే నిర్మాణం చేయడం విశేషం. ప్రస్తుతం వైఎస్సార్‌ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జితోపాటు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇన్‌ అవుట్‌ ప్రాతిపదికన మరో బ్రిడ్జి నిర్మాణం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.


భారీ సెట్టింగ్‌లు
వివాహ రిసెప్షన్‌ను ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో వంద ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. 3 లక్షల మంది అతిధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విదంగా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందుకోసం మొత్తం 100 ఎకరాల్లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదికతో పాటు పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, వివాహ రిసెప్షన్‌ వేదికలు బాహుబలి లాంటి సెట్టింగ్‌లతో నిర్మాణం చేయడం గమనార్హం. వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మాణం చేస్తున్నారు.


దీంతోపాటు 3 లక్షల మందికి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆది నుంచి సంచలనాలకు వేదికగా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తుతం తన కుమార్తె వివాహ రిసెప్షన్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. దీంతోపాటు ఇప్పటికే ఈ వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరుకానున్నట్లు ప్రచారం సాగుతుంది. మరి తెలంగాణ సీఎం రాకపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెలువడలేదు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం ఇదే స్థాయిలో తన కుమారుడి వివాహ వేడుక నిర్వహిస్తారా? అనేది చర్చానీయాంశంగా మారింది.