Khairtabad Corporator Joins Congress : ఖైరతాబాద్ కార్పొరేటర్, దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఇవాళ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ కు చేరుకున్న ఆమె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గ్రేటర్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు ముద్దుగా పిలిచే నేత పీజేఆర్, ఆయన బిడ్డ విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అన్నారు. బస్తీలలో ఉన్న పేదోళ్లకు పీజేఆర్ దేవుడు అని గుర్తుచేశారు.
కృష్ణా జలాల కోసం పోరాటం
ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా ఉన్నారు. లక్షలాది మంది పీజేఆర్ పుణ్యమా అని ఇండ్లు కట్టుకున్నారు. పేదోళ్ల కోసమే చివరి వరకు పోరాటం చేసిండు. పీజేఆర్ సీఎల్పీ నేతగా ఎదిగిండు. సొంత పార్టీలోనే ప్రజల కోసం గళం విప్పారు. కృష్ణా జలాల కోసం పోరాటం చేసిండు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా పీజేఆర్ వల్లనే పూర్తి అయ్యింది. నగరంలో నీళ్ల కోసం కుండలతో, బిందాలతో నిరసన తెల్పడం నేర్పిందే పీజేఆర్. అసెంబ్లీలో కూడా పీజేఆర్ నీళ్లకోసం, ఇండ్ల కోసం పోరాటం చేశారు. పరిశ్రమల్లో కార్మికుడుకి అన్యాయం జరిగిన ముందుండి పోరాటం చేసేవారు. ఇప్పుడు పీజేఆర్ ఉంటే ఫార్మా భూసేకరణకు అడ్డుగా పోరాటం చేసేవారు. - రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు
పీజేఆర్ కు కాంగ్రెస్ తో విడదీయరాని బంధం
పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతలకు విడదీయరాని బంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ పెంచి పోషించిన వాళ్లు ఇవాళ నాయకులయ్యారన్నారు. అట్లాంటి కుటుంబానికి మనం అండగా ఉండాలన్నారు. పేదోళ్ల కోసం పెద్దమ్మ గుడి ఉండాలని కట్టించారన్నారు. నగరంలో పేదోళ్లకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వర్షం వస్తే బస్తీలు మునిగిపోతున్నాయన్నారు. హైదరాబాద్ ముఖచిత్రం మార్చడానికి కేసీఆర్ సర్కార్ పనిచేస్తలేదన్న ఆయన... విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున, ప్రజలకోసం పోరాటం చేస్తారన్నారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చే బాధ్యత పీజేఆర్, అంజన్ కుటుంబాలు తీసుకుంటాయని రేవంత్ రెడ్డి అన్నారు.
మేడిపల్లి ఫార్మి సిటీపై పోరాటం చేస్తాం - కోమటిరెడ్డి
మేడిపల్లి ఫార్మా సిటీ కట్టనియ్యకుండా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వలోనే అక్కడికి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్తానన్నారు. ఒక్క ఎకరా కూడా పోనివ్వకుండా చూస్తామన్నారు.
పీజేఆర్ ఆశయాలతో ముందుకెళ్తా-విజయారెడ్డి
ఖైరతాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. పీజేఆర్ బిడ్డగా తనను ఆశీర్వధిస్తూ నడిపించారన్నారు. కాంగ్రెస్ లో చేరడం తొందరపాటు నిర్ణయం కాదన్నారు. రెండు నెలలుగా దేశంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జంట నగరాల్లో మహిళలను కాపాడుకోలేకపోతున్నామన్నారు. యువత తప్పుదారి పడుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలను ఆశ పెట్టడానికి పథకాలు తెస్తున్న అవి సంతృప్తి ఇచ్చేవి కావన్నారు. తెలంగాణ ప్రజల బాగోగులు పక్కన బెట్టి ఎజెండా మార్చుకొని ముందుకు వెళ్తుండడం మంచిగ లేదన్నారు. రైతుల పక్షాన ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని ఆమె గుర్తుచేశారు. పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదన్న ఆమె.. నాన్నగారి ఆశయాలతో ముందుకు వెళ్తానన్నారు. తన తండ్రి పీజేఆర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పార్టీ కోసమే పోరాడారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు పోరాడతామన్నారు.