KCR To Maharastra : భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలన్న లక్ష్యం పెట్టుకున్న కేసీఆర్ జనవరిలో మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. క్రిస్మస్ తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు.  కొత్త సంవత్సరంలో తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.  మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. జనవరి ఫస్ట్ వీక్ లో  ముఖ్యమంత్రి కెసిఆర్ నాందేడ్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే జిల్లా నాయకులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడి నేతలు, ప్రజలను కలిసి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరిస్తునారు.  శుక్రవారం ఎమ్మెల్యే జోగురామన్న మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో పర్యటించి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. 


రాజురా స్వతంత్ర భారత పక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వామన్ రావు శతప్ మూడుసార్లు ఎమ్మెల్యేగా రాణిస్తూ.. శత్కరి సంఘటన్ ముఖ్య నాయకుడిగా  వ్యవహరిస్తున్నారు. వారితో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమగ్ర అభివృద్దే లక్ష్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, బీ.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన వెంట డిసిసిబి, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, రౌత్ మనోహర్ తదితరులు ఉన్నారు.  బీ.ఆర్.ఎస్ పార్టీని మహారాష్ట్రలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని జోగు రామన్న చెబుతున్నారు.   


నిర్మల్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గ్రామాలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టి ప్రత్యేక దృష్టి పెట్టారు.  బీఆర్‌ఎస్‌ పార్టీని సరిహద్దు గ్రామాల్లో విస్తరించి అక్కడ పార్టీని పటి ష్టం చేయాలని భావిస్తున్నారు.  సరిహద్దుల్లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారంటున్నారు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, యువజన సంఘాలతో కూడా మంత్రి అల్లోల ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపినట్లు సమాచారం.  మహారాష్ట్రకు చెందిన బీజేపీ అసంతృప్తి వాదులతో సైతం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా అన్ని పార్టీల్లోని అసంతృప్తి వాదుల ను కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.  


 మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించడమే కాకుండా సభ్యత్వ నమోదును లక్ష్యంగా చేసుకుంటున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఆసరాపెన్షన్‌లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమాలతో పాటు ఇతర పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెండా రూ పొందుతుందని భరోసా కల్పించనున్నారు. అలాగే రాష్ర్టాలకు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంత మేరకు నష్టం చేకూరుస్తుందోనన్న అంశా న్ని కూడా వివరించాలని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టుల నిర్మా ణం, మిషన్‌ భగీరథ, రోడ్ల నిర్మాణాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలపై అక్కడి ప్రజలకు వివరించి వారిని ఆకర్షించుకోవాలని యోచిస్తున్నారు. కేసీఆర్ పర్యటన తర్వాత కీలకమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు.