KCR :  కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి  ఆలయానికి మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.   తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతంరం తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్న సీఎం... సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. సింగూరు నీటి కోసం రైతులు ఉద్యమించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నిజాంసాగర్ కూడా ఒక భాగమేనన్న ఆయన.. బాన్సువాడ ప్రాంతంలో గతంలో అనేక ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం రూ.1500 కోట్ల వరి పంట సాగవుతోందని తెలిపారు. బాన్సువాడ ప్రజలకు భవిష్యత్ లో స్పీకర్ పోచారం సేవలు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాంతో పాటు నియోజకవర్గానికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు.


కొండపై స్వామి వారి ఆలయం అద్భుతంగా రూపు దిద్దుకోవడానికి కారణం కేసీఆర్ అని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.  కేసీఆర్  ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కరవు లేదని తెలిపారు. పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయన్నారు. గోదావరి జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు   కళకళ లాడుతోందని చెప్పుకొచ్చారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చారన్నారు. 11000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టామని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి 66 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తమ నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశ ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని పోచారం పేర్కొన్నారు.


జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ నియామకాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర బీఆర్‌ఎస్‌   పార్టీ జనరల్‌ సెక్రెటరీ   బాధ్యతలను హిమాన్షు తివారీకి   సీఎం కేసీఆర్‌ అప్పగించారు. కొద్ది రోజుల కిందట  మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మానిక్‌ కదమ్‌ను నియమించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను  నియమించారు.