Medaram Jathara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ది పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దది అని, తెలంగాణ కుంభమేళాగా ఇది గుర్తింపు పొందిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమ్మక్క-సారలమ్మ స్పూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలని కోరారు.  ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఈ జాతర చారిత్రక ప్రతీక అని. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని వనదేవతలను ప్రార్థిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.


రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు నుంచి పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులకు వస్తున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. ఒకప్పుడు సమైక్య పాలకుల హయాంలో అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం ఇవాళ సాగునీటి జలాలతో సస్యశ్యామలంగా మారిందని అన్నారు. జాతరలో భాగంగా ఇటీవల సారలమ్మను గద్దెలపైకి  తీసుకొచ్చారు. కన్నెపల్లి నుంచి జంపన్న వాగు మీదుగా మేడారానికి తీసుకొచ్చారు. డప్పుడోలు వాయిద్యాలు, జయజయధ్వానాలు, భక్తుల కోలాహలం మధ్య సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. దీంతో జాతరలో తొలి ఘట్టం ముగియగా.. నేడు మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ఇవాళ సమ్మక్కను గద్దెలపైకి తీసుకురానున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరుకోనుంది.


చిలకలగుట్ట నుంచి సమ్మక్కకు  మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారిని స్వాగతించనున్నారు. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. అమ్మవారికి స్వాగతం పలుకుతూ దారి పొడవునా భక్తులు ముగ్గులు వేశారు. చిలకలగుట్టపై కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గుట్టపై నుంచి పూజారులు కిందకు తీసుకొస్తారు. అనంతరం గద్దెలపై ప్రతిష్టిస్తారు. సమ్మక్క రాకకు గుర్తుగా ఎస్పీ ఏకే 47తో మూడు రౌండ్లు కాల్పులు జరుపుతారు. సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు పూజారులు చిలకలగుట్ట వద్దకు చేరుకున్నారు.


ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి వెళ్లి సమ్మక్క వద్ద మూడు గంటల పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కిందకు తీసుకురానున్నారు. సమ్మక్క రాకను చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. జంపన్న వాగులో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే కార్యక్రమం కోసం 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రోప్ పార్టీని ఏర్పాటు చేయడంతో మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలపైకి చేరుకున్న తర్వాత  పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు నిలువెత్తు బెల్లం(బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు. ఆన్‌లైన్‌లోనూ మొక్కులు చెల్లించే అవకాశాన్ని అధికారులు కల్పించారు.