KCR in BRS Executive Committee Meeting: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని ఎండగట్టడంలో రాష్ట్ర ఎంపీలు విఫలమయ్యారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన  పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ అవమానకర వ్యాఖ్యలు చేస్తే, రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు.  ఈ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? వీరికి పౌరుషం లేదా? అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ సభలో ఉన్నా రణరంగం చేసి, సదరు ఎంపీతో క్షమాపణ చెప్పించేవాళ్లం  అని కేసీఆర్ స్పష్టం చేశారు.

 కూల్చడంలోనే ఈ ప్రభుత్వం నంబర్ వన్ 

రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తాము పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడితే, ప్రస్తుత పాలకులు భూకబ్జాలు, కూల్చివేతల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా   పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఈ వ్యవస్థను రద్దు చేయడంపైనే పెడతానని హామీ ఇచ్చారు. చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తుంటే జాలి వేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

పార్టీ యంత్రాంగం సంపూర్ణ ప్రక్షాళన 

పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ కమిటీ మినహా, ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లా, గ్రామ, మండల, పట్టణ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని, వెంటనే కొత్త కమిటీల నియామకం మరియు సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత టి. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఆయనను బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించి సమావేశానికి పరిచయం చేశారు.

రైతు కష్టాలపై ఆవేదన 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారడంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతన్నలు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారని, ఇది చూస్తుంటే తీవ్ర బాధ కలుగుతోందని అన్నారు. గతంలో తాము 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో సాగును పండుగ చేస్తే, నేడు కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.   

కేటీఆర్‌కు కీలక బాధ్యతలు.. పునర్నిర్మాణమే లక్ష్యం 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే కీలక బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.