Telangana No Early Polls :   తెలంగాణలో ముందస్తు ఊహాగానాలకు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెర వేసేశారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కేసీఆర్ పార్టీ నేతలకు ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీఎన్నికలు జరుగుతాయన్నారు.  ముందస్తు ఎన్నికలు అన్న ఆలోచనలే పెట్టుకోవద్దని.. ఇంకా ఎన్నికలుక ఏడాది సమయం ఉందని..  ఈ ఏడాది మొత్తం ప్రజల్లోనే ఉండాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.  అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు..సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు మరింతగా చేరువ కావాలని చెప్పారు. 


కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడవద్దని సూచించిన కేసీఆర్ 


అదే సమయంలో భారతీయ జనతా పార్టీ విషయంలో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశమయ్యాయి.  బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని.. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది..జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అయినప్పటికీ భయపడవద్దని.. ఆందోళనకు  గురి కావొద్దని ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలపై గురి పెట్టారని.. వారి పేర్లను సమావేశంలో కేసీఆర్ వివరించినట్లుగా చెబుతున్నారు. ఈ పది మాత్రమే కాదు.. వ్యాపారాలున్న ఇతరులపై కూడా బీజేపీ ఒత్తిడి పెంచుతుందన్నారు. ఫిర్యాదులు బీజేపీ నేతలే చేయించి.. దాడులు చేస్తారని కేసీఆర్ అంచనా వేశారు. ప్రస్తుతం బీజేపీతో జరుగుతున్న పోరాటం ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుది కావున.. పొరపాట్లు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. 


ఎన్నికల వరకూ ప్రతీ రోజూ ఫీల్డ్‌లోనే ఉండాలనికేసీఆర్ ాదేశం
 
టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ సమావేశానికి హాజరయ్యారు.. సమావేశం ప్రారంభమైన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, పార్టీ ప్రచారం, వచ్చిన ఓట్లపై విశ్లేషించారు.  అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి సంసిద్ధం కావడంపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.  క్యాడర్ బలోపేతంతో పాటు ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకంకావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో ఇంచార్జులను ప్రకటించాలన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ ఇంఛార్జులను కేసీఆర్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 


బీఆర్ఎస్ అంశంపైనా చర్చించిన టీఆర్ఎస్ కార్యవర్గం 


 త్వరలోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో ఈసీ ప్రకటన అనంతరం బీఆర్ఎస్ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ సమావేశానికి  ఫామ్ హౌస్ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో పాటే ..ఆయన కాన్వాయ్‌లోనే తెలంగాణ భవన్‌కు వచ్చారు. 


నిజాం కాలేజీ స్టూడెంట్స్ ఆందోళనకు హ్యాపీ ఎండింగ్ - హాస్టల్ మొత్తం వారికే !