Breaking News Live: ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం జగన్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 18 Feb 2022 09:26 PM
ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. 


ఆదివారం ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం జగన్..


 పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్​ను ప్రారంభించనున్నారు.


 ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు


అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 


అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేరుకుంటారు.


 నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు.


 ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు

Himachal Pradesh CM: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాల సమాచారం.

Odisha Polling: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో ముగిసిన పోలింగ్

Odisha Elections: విజయనగరం. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఒరిస్సా ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ బూతుల దగ్గరకు ఒరిస్సా పోలీసులు ఆంధ్రా మీడియాను అనుమతించలేదు. సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. తెలుగు మాట్లాడే పలు గ్రామాల్లో ఎన్నికలను స్వస్ఛందంగా బహిష్కరించిన నేరెళ్లవలస, దొరలతాళ్లవలస, చిన్న దొరలతాళ్లవలస, తదితర గ్రామాలు.

పల్నాడులో నాటు తుపాకీల కలకలం 

గుంటూరు జిల్లా పల్నాడులో కొందరు నాటు తుపాకీ హల్ చల్ చేశారు.  నిందితులు గతంలో లిక్కర్ బిజినెస్ చేస్తూ బెదిరింపులకు పాల్పడేవారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, మరికొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన స్వల్ప ఘర్షణలో నిందితులు తుపాకీలతో హల్ చల్ చేశారు. మంత్రుల పర్యటన ముందురోజే పలనాడులో తుపాకీలు లభ్యం కావడం కలకలం రేపింది. 

G Kishan Reddy: మేడారం వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గిరిజన జాతర సమ్మక్క - సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క లాంఛనంగా గద్దెపైన కొలువుదీరారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి మేడారంలో పర్యటించారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను కిషన్‎రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి కిషన్ ‎రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు.

Chandra Babu: చంద్రబాబు స్థలం కబ్జాకు యత్నం

నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు యత్నం జరిగింది. సర్వే నెంబర్‌ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు స్థలంలో కబ్జాదారులు రాతి స్తంభాలు నాటారు. 1989లో 87 సెంట్లు రిజిస్టర్‌ భూమి కొనుగోలు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు రిజిస్టర్ చేయించారు. ఆ 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమిని తర్వాత చంద్రబాబు వితరణగా ఇచ్చారు. చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఇప్పుడు కబ్జాదారులు ఫెన్సింగ్‌ వేస్తున్నారు. ఈ భూమి ఆక్రమించేందుకు యత్నించినది ఎవరో కాదు.. చంద్రబాబు పెదనాన్న కుమారుడు అయిన రాజేంద్ర నాయుడు.

Panjagutta: పంజాగుట్టలో దారి దోపిడీ

హైదరాబాద్‌‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పంజాగుట్టలో గోల్డ్‌ షాప్‌ యజమాని దుకాణం మూసేసి డబ్బులు తీసుకెళ్తుండగా దృష్టి మళ్లించిన దొంగలు దోపిడికి తెగబడ్డారు. గ్రీన్‌ ల్యాండ్స్‌ దారిలో బైక్‌పై వచ్చిన దొంగలు బంగారం షాపు యాజమాని నుంచి రూ.3.5 లక్షలున్న రెండు బ్యాగ్‌లతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించడంతో  రూ.1.5 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను రోడ్డు మీదే వదిలేసి 2 లక్షల బ్యాగ్‌తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు, తెలిసినవాళ్ళ పనా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

MLC Kavitha: శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్సీ కవిత దంపతులు

ఎమ్మెల్సీ కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఎమ్మెల్సీ కవిత - అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామి వారికి జరిగే నిజపాద సేవలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.

Nagar Kurnool: నాగర్‎కర్నూల్‎లో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు

నాగర్‎కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పీఏ పల్లికి చెందిన కిరణ్మయి (22), శిరీష (20), అరవింద్ (23)గా పోలీసులు గుర్తించారు.

Background

అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదు. ఇది బలహీనపడుతూ బర్మా వైపు కదులుతోంది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది.పొడి గాలులు కారణంగా మూడు రోజుల పాటు పగటి పూట వేడిని పెంచేస్తాయి. రాత్రి పూట చలిపెట్టిస్తాయి. 21న జరగబోయే రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూకు వాతావరణ ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమలో వాతావరణంలో పెద్ద తేడా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.


తెలంగాణలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం కాసేపు పొగమంచు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణగ్రత 31డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది.


కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడొచ్చని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ రేపు చిరుజల్లులు పడొచ్చు. ఎల్లుండి నుంచి రెండు రోజులు వాతావరణం పొడిగానే ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండలో 33 డిగ్రీలు నమోదు కానుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత అక్కడే నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది.


బంగారం వెండి ధరలు


ఇవాళ కూడా బంగారం ధర బాగా తగ్గింది. గ్రాముకు 40 రూపాయల చొప్పున తగ్గింది. వెండి ధర మాత్రం గ్రాముకు రూ.0.20 పైసలు పెరిగి.. 68 రూపాయలకు చేరింది. ఇప్పుడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 4,580 రూపాయలు ఉంది. అంటే పది గ్రాముల బంగారం 45,800అన్నమాట. నిన్న 46, 200 ఉన్న బంగారం ఇవాళ నాలుగు వందలు తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం గ్రామ్‌పై 43 రూపాయలు తగ్గింది. అంటే పది గ్రాముల ధర 49, 970 రూపాయలు ఉంది. నిన్న ఇదే 24 క్యారెట్ల బంగారం ధర 50, 400 రూపాయలు ఉంది. ఇప్పుడు వెండి కిలో 68 వేలు ఉంది. ఇదే కిలో వెండి నిన్న 67వేల 800 ఉంది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఒక్కసారిగా పెరిగింది.


పెట్రోల్, డీజిల్ ధరలు


హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజుల తర్వాత నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 18) పెట్రోల్ ధర రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.35 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు పెరిగి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా పెరిగాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం స్థిరంగా ఉంది. ముందు రోజు తరహాలోనే రూ.110.51గా ఉంది. డీజిల్ ధర కూడా బెజవాడలో రూ.96.59 గా నిలకడగానే ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.