KCR No TO Mamata Meeting :  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం నిర్వహించాలనుకుంటున్న విపక్ష పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎలాంటి సమాచారం లేదని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. మూడు , నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే మమతా బెనర్జీ నిర్వహించబోయే విపక్ష పార్టీల సమావేశానికి కేసీఆర్ హాజరు కానట్లేనని అనుకోవాలి. 


రాష్ట్రపతి ఎన్నికపై కేసీఆర్ అనాసక్తి


విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు మమతా బెనర్జీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఫోన్ చేసి ఆహ్వానించారు. కేసీఆర్‌కు కూడా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే కేసీఆర్ మాత్రం సమావేశానికి వెళ్లడంపై నిరాసక్తంగా ఉన్నారు. మొదటగా తానే లీడ్ తీసుకుని అన్నా హజారేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి సంచలనం సృష్టిద్దామనే ప్రణాళికలు వేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పలు రాష్ట్రాలకు వెళ్లి చర్చలు జరిపి వచ్చారు.కానీ ఎక్కడా ఆయనకు సానుకూల ఫలితం కనిపించకపోవడంతో లైట్ తీసుకున్నారని అంటున్నారు.  


నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్ 


కేసీఆర్ వెళ్లకపోయినా ఆయనకు బదులుగా పార్టీ ప్రతినిధులు ఎవరైనా వెళ్తారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే కేసీఆర్ మద్దతిస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. నాలుగైదు రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.   అయితే కేసీఆర్ ఎజెండా రాష్ట్రపతి ఎన్నికలు కాదు.. భారత రాష్ట్ర సమితి ప్రకటన.  ఈ హడావుడిలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఐక్యత లేకపోవడం వల్ల గెలుపు అనేది సాధ్యం కాదని  కేసీఆర్ సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


దీదీ సమావేశానికి హాజరయ్యే వారెందరు ?


మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి ఎంత మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులు హాజరవుతారన్నదానిపై స్పష్టత లేదు. కాంగ్రెస్ కూటమిలోని ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయాలనకుుంటే రెండు పార్టీలు కలిసి చర్చించే అవకాశం ఉంది. అయితే కరోనా కారణంగా సోనియా గాంధీ ఆస్పత్రి, ఈడీ విచారణ కారణంగా రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసులో ఉంటున్నారు. దీంతో విపక్షాల్లో స్తబ్దత నెలకొంది.