Telangana New Ministers :   బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టిక్కెట్లు ఇవ్వలేకపోతున్న ఇద్దరిని మంత్రుల్ని చేయాలని నిర్ణయిచుకున్నారు. బుధవారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా పట్నం మహేందర్ రెడ్డి మీడియాకు చెప్పారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుండి .. పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈటల రాజేందర్ శాఖల్ని హరీష్ రావుకు కేటాయించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ  చేయలేదు. 


అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తప్పని పరిస్థితుల్లో టిక్కెట్లు నిరాకరించిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని అనుకున్నారు. తాండూరు నుంచి టిక్కెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డి,  కామారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ కోసం త్యాగం చేస్తున్న గంప గోవర్ధన్ కు చాన్సివ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కేబినెట్లో ఒక్క పోస్టే ఖాళీగా ఉంది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనూ రాజీనామా చేయించాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  మరో వైపు గవర్నర్ పుదుచ్చేరిలో ఉన్నారు. మంత్రి వర్గసభ్యుల ప్రమాణస్వకారం గురించి ప్రభుత్వం- నుంచి సమాచారం పంపారు.  బుధవారం రాజ్ భవన్‌ లో ఇద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.                                            


అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారి పదవి కాలం చాలా స్వల్పమే. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే  వరకూ మాత్రమే పదవిలో ఉంటారు. ఒక వేళ బీఆర్ఎస్ గెలిచినా వారికి మళ్లీ చాన్సిస్తేనే  మంత్రులు అవుతారు. లేకపోతే పదవి కోల్పోతారు. నిజానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా వారు చేయగలిగిందేమీ ఉండదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరవాత మంత్రులుగా కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఏ నిర్ణయాలూ తీసుకోలేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. అయితే మంత్రులుగా మాత్రమే ఉంటారు. వారిద్దరూ పార్టీ మారకుండా కేసీఆర్ ఈ ఆఫర్ ఇచ్చారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.                   


మంత్రి పదవులు ఉన్నందున వారు ఇతర పార్టీల్లో చేరి పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోతే.. ఎమ్మెల్సీగానో అవకాశం ఇస్తానని కేసీఆర్ బుజ్జగించి ఉంటారని చెబుతున్నరు. పట్నం మహేందర్ రెడ్డి కీలక నేత. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే..  ఆయన సోదరుడు కొడంగల్ అభ్యర్థి కూడా వెళ్లిపోతారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుంది. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు