KCR giving clarity on MP Candidates : పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను సైతం అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశమైన కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.
సమావేశాల్లో అభ్యర్థులపైనా కేసీఆర్ స్పష్టత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేసే అంశంపై స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దించనున్నారు. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కు చెందిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. బాల్క సుమన్ తో పాటు కొప్పుల ఈశ్వర్ పేరును పరిశీలించారు. చివరికి కొప్పుల వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే.. నామా పేరును కేసీఆర్ ప్రకటించారు. ఇక మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే మరోసారి చాన్సిచ్చారు. సమీక్షలు జరుపుతున్నప్పుడే కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు.
సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్‌కు జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాలేదు. తెల్లం వెంకట్రావు ఆదివారం కుటుంబంతో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఉన్న హోటల్ కు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు అయితే అధికారికంగా పార్టీలో చేర్చుకునే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివసారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన తెల్లం వెంకట్రావ ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరారు. కానీ టిక్కెట్ రాదని తెలియడంతో మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
బీఆర్ఎస్‌కు వలస సమస్య పెద్దదిగా మారుతోంది. సిట్టింగ్ ఎంపీలు , పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీ మారిపోతున్నారు. బీజేపీ లేదా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్‌కు కత్తి మీద సాములా మారింది.