KCR focused on the selection of Warangal BRS MP candidate : వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్య తిరస్కరించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో పలువురు సీనియర్ నేతలు ఆ స్థానం నుుంచి  పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే మరో కీలక నేత ఇటీవల ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్‌ను వరంగల్ బరిలో ఉంచాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. 


అందరి కంటే ఎక్కువగా  తాటికొండ రాజయ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోలేదు. టిక్కెట్ కోసం పరిశీలన చేయలేదు. దీంతో అటూ ఇటూ కాకుండా అయిపోయారరు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి కడియం శ్రీహరికి కేసీఆర్ చాన్సిచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ టిక్కెట్ కూడా కడియం కుమార్తెకే ఇచ్చారు. అయినా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.  కడియం కావ్య ఎన్నికల్లో పోటికి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన నేపథ్యంలో రాజయ్యను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనతో బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.                       


గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేశారు.  స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అయితే వేరే ఏ పార్టీలోనూ చేరకపోవడంతో వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఆయనను పోటీచేయిందుకు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నారు. రాజయ్య కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అవుతారని సమాచారం. తన నిర్ణయాన్ని కేసీఆర్‌కు తెలియజేసే అవకాశముందని తెలుస్తోంది.                  


  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన కడియం శ్రీహరి కుమార్తె కావ్య   కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడైన రాజయ్య పేరును బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. చాలా కాలంగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి కుమార్తెకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. రాజయ్యే సరైన ప్రత్యర్థి అవుతారని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ జిల్లా నేతలు రాజయ్య వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్‌కు బాబూమోహన్ కు కూడా మంచి అనుబంధం ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.