KCR letter to SIT:   ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీసుల ఈ చర్య కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. లేఖలో కేసీఆర్ ప్రధానంగా న్యాయపరమైన అంశాలను ప్రస్తావించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసం వద్దే విచారించాలని సీఆర్‌పీసీ   సెక్షన్ 160 స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే,  సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఏపీ హైకోర్టులోని  వీడీ మూర్తి  కేసు తీర్పును కూడా ఉటంకిస్తూ, నివాసం ఉంటున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చేసిన చట్టాన్ని పోలీసులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు.   

Continues below advertisement

 పోలీసులు తన ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామాను సాకుగా చూపడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. అఫిడవిట్ లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని, ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతానికే నోటీసులు పంపాలని చట్టం చెబుతోందని వెల్లడించారు. హరీష్ రావు వంటి ఇతర నేతల విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో తనకు పంపే ఏ నోటీసులైనా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని, చట్టవిరుద్ధంగా ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కూడా ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.        అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చినప్పటికీ, ఒక బాధ్యతాయుత పౌరుడిగా , ప్రతిపక్ష నేతగా తాను విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు తాను సిద్ధమని, నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. అయితే, ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, చట్టపరంగా అన్ని అంశాలను ఎదుర్కొంటానని ఆయన తన లేఖ ద్వారా పోలీసులకు, ప్రభుత్వానికి గట్టి సంకేతాలు పంపారు. 

Continues below advertisement