CJ Roy Story:  బెంగళూరు, కేరళల్లో  సీజే రాయ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక సక్సెస్ ఫుల్ బ్రాండ్. సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, తన స్వయంకృషితో  కాన్ఫిడెంట్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. తన సంపాదనను, లగ్జరీ కార్ల వైభవాన్ని గర్వంగా ప్రపంచానికి చూపించుకోవడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. విలాసవంతమైన జీవనశైలి, సినిమాలపై మక్కువతో చిత్ర నిర్మాణం.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగులోనూ ఒక తెలియని కాన్ఫిడెన్స్  ఉట్టిపడేది. అంతటి ధైర్యవంతుడు, వేల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి, తన సొంత కార్యాలయంలోనే  తుపాకీతో కాల్చుకుని తనువు చాలించడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

కాన్ఫిడెన్స్ కూలిపోవడానికి కారణం? 

రాయ్ మరణం తర్వాత ఆయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలోని చీకటి కోణాన్ని బయటపెడుతున్నాయి.  రాయ్‌కి అప్పులు లేవు, వ్యాపార ఇబ్బందులు లేవు.. కేవలం ఐటీ అధికారుల వేధింపులే ఆయన ప్రాణం తీశాయి అన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంతటి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికైనా, చట్టం పేరుతో నిరంతరం సాగే మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యులను విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటివి ఒక దశలో అశక్తతను కలిగిస్తాయి. మూడు రోజుల పాటు సాగిన సోదాలు, అధికారుల ప్రశ్నలు ఆ ధీశాలిని కుంగదీశాయా? వ్యవస్థలో పాతుకుపోయిన వేధింపుల ధోరణి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను  ఆత్మహత్య అనే బలహీన క్షణానికి నడిపించిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆదాయపు పన్ను వర్సెస్ ఆత్మగౌరవం 

సీజే రాయ్ తన సక్సెస్‌ను ఎంత బహిరంగంగా ప్రదర్శించేవారో, అదే ఆయనకు శాపంగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లగ్జరీ కార్లు, హై-ప్రొఫైల్ ఈవెంట్లు ఐటీ అధికారుల కంటికి లక్ష్యంగా మారినట్లుగా కనిపిస్తోంది.  సంపాదించిన ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నా, అధికారుల విచారణ తీరు ఆయన్ను తీవ్ర అవమానానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఆత్మగౌరవంతో బతికే వ్యక్తులు, నలుగురిలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరనేది రాయ్ విషయంలో మరోసారి రుజువైంది. ఒక వ్యాపారవేత్తను ఆర్థికంగా నిలదీయడం చట్టం బాధ్యతే కావచ్చు, కానీ అది ప్రాణాలు తీసే స్థాయికి చేరడం వ్యవస్థ వైఫల్యమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

రాయ్ మరణం ఒక హెచ్చరిక

సీజే రాయ్ మరణం దేశంలోని పారిశ్రామిక వేత్తల్లో ఒకరకమైన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఎంత కష్టపడి ఎదిగినా, వ్యవస్థ తలుచుకుంటే ఒకే ఒక్క నిర్ణయంతో జీవితాలను అల్లకల్లోలం చేయగలదనే చేదు నిజం ఇక్కడ కనిపిస్తోంది. కేఫ్ కాఫీ డే సిద్ధార్థ్  నుంచి ఇప్పుడు రాయ్ వరకు.. విజయవంతమైన వ్యాపారవేత్తల వరుస ఆత్మహత్యలు దర్యాప్తు సంస్థల తీరుపై పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. రాజీ పడకుండా వ్యాపారం చేసిన రాయ్, మరణం విషయంలోనూ తనదైన రీతిలో గమ్యం వైపు వెళ్ళిపోయారు, కానీ ఆయన వదిలి వెళ్ళిన ప్రశ్నలు మాత్రం వ్యవస్థలో ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.