KCR called to get ready for an invasion of Congress rule: కాంగ్రెస్ పాలనను తాను మౌనంగా చూస్తున్నానని.. కొడితే గట్టిగా కొట్టడం తనకు అలవాటని కేసీఆర్ అన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో తనను కలిసిన నేతలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కైలాసం ఆడితే పెద్దపాము మింగిసినట్లుగా పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు. తాను కరోనా అప్పుడు కూడా తాము రైతు బంధు ఆపలేదని .. రైతు బీమా ఎన్నో రైతు కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. ఒక్క పథకమూ సరిగ్గా అందడం లేదని.. అన్నీ గంగలో కలిసిపోయాయని మండిపడ్డారు.
ఏమైనా అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ కరెంట్ కోతలు వచ్చాయి.. మళ్లీ కరవు వచ్చిందన్నారు. మంచి నీటి సమస్య కూడా వచ్చిందని ఇక ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయడం లేదని.. అన్ని ప్రాజెక్టులను పడుకోబెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు.
Also Read: ఫిరాయింపులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ? - తెలంగాణ అసెంబ్లీ సెక్రటరికి సుప్రీంకోర్టు ప్రశ్న
తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని కేసీఆర్అన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానన్న్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రజలు కొట్టేటట్టు ఉన్నారన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు.
చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడేనని.. ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని మబ్బులు తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయన్నారు. మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుందని.. మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారని.. ఫామ్ హౌస్ లో పంటలు తప్ప ఏముంటాయని కేసీఆర్ ప్రశ్నించారు.