Kavitha was not granted bail in the Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అంచనాలు తలకిందులు అయ్యాయి. సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాతనే తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి నెలలో హైదరాబాద్ కు వచ్చి విచారణ చేపట్టిన అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం నాడు నిరాకరించింది.
కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు వినిపించారు. మార్చి నుంచి గత 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారు. మహిళ అయి, అందులోనూ ప్రజా ప్రతినిధి అయిన కవితను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారని దర్యాప్తు సంస్థల తీరును ముకులు రోహత్గీ ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందారని, బెయిల్ మంజూరు కావడానికి కవిత కూడా అర్హులరాలేనని రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసి, వారి అభిప్రాయాన్ని తీసుకుంటామని జస్టిస్ గవాయి చెప్పారు.
దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం
కవితకు బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీలో మకాం వేశారు. బెయిల్ కోసం సీనియర్ లాయర్లను, న్యాయ నిపుణులను సంప్రదించి పకడ్బందీగా వ్యవహరించారు. ఈ క్రమంలో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, ఆమెకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని ముకుల్ రోహత్గీ సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి నిరాకరించారు. ఈ విషయంలో ముందుగా కవితను విచారించిన దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే వాదనలు వింటామన్నారు. మధ్యంతర బెయిల్ సైతం ఇప్పుడు ఇవ్వలేమన్నారు. సుప్రీం ధర్మాసనం ఆగస్టు 20వ తేదీకి కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. నిర్ణీత గడువులోగా ఈడీ, సీబీఐలు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ఈ వారంలో బెయిల్ వస్తుందనుకున్న కేటీఆర్
కవితకు కచ్చితంగా బెయిల్ వస్తుందని కేటీఆర్ భావించారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని మెడికల్ గ్రౌండ్స్ మీద సోదరి కవితకు బెయిల్ మంజూరు చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశగా ఎదురుచూశారు. దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడం కష్టమని ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర బెయిల్ సైతం ఇచ్చేదిలేదని, దర్యాప్తు సంస్థల అభిప్రాయాన్ని కోరుతూ నోటీసులు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు కవిత జైల్లో ఉండనున్నారు. ఒకవేళ ఈడీ, సీబీఐలు అనుకూల అభిప్రాయాన్ని చెబితేనే కవితకు బెయిల్ లభించే అవకాశం ఉంది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇటీవల బెయిల్ లభించింది. పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న ఆప్ కీలక నేత బెయిల్ పై విడుదలయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. కానీ సీబీఐ కేసులో ఇంకా ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారంతా ఒక్కొక్కరుగా బెయిల్ పొందారు. నెక్ట్స్ కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.