BRS Objections ECI On TRS:  తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి రగిల్చి, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని  తెలంగాణ రక్షణ సేన పేరుతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత సొంతంగా రాజకీయ అస్తిత్వం కోసం కవిత ఈ కొత్త పార్టీని ప్రకటించారు. అయితే, భారత ఎన్నికల సంఘం  నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయం, అభ్యంతరాల కోసం పత్రికా ప్రకటన జారీ చేసిన తరుణంలో.. ఆమె ఎంచుకున్న  TRS  అనే సంక్షిప్త నామంపై ఈసీకి ఏకంగా 600 నుండి 700 వరకు భారీ సంఖ్యలో అభ్యంతరాలు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Continues below advertisement

TRS పేరు కోసం మరో పార్టీ దరఖాస్తు 

ఈ వివాదాన్ని మరింత క్లిష్టంగా మారుస్తూ.. కవిత కంటే ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన తెలంగాణ రాష్ట్రసామాజిక సేన  అనే మరో ప్రాంతీయ పార్టీ కూడా ఇదే TRS  అనే సంక్షిప్త నామంతో గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ మే మొదటి వారంలో పత్రికా ప్రకటనలు ఇవ్వగా.. సోలాపూర్ ఆధారిత పార్టీ అంతకంటే ముందే ఏప్రిల్ చివరి వారంలోనే జాతీయ దినపత్రికలలో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి తోడు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం  పరిధిలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ , 'తెలంగాణ రాజ్య సమితి  అనే రెండు చిన్న పార్టీలు నమోదై ఉండటం కవిత వ్యూహాలకు పెద్ద బ్రేక్‌గా మారింది. 

Continues below advertisement

బీఆర్ఎస్ కూడా తీవ్ర అభ్యంతరం

మరోవైపు, ఈ వ్యవహారంలో  భారత్ రాష్ట్ర సమితి  కూడా అధికారికంగా రంగంలోకి దిగి ఈసీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఉవ్వెత్తున సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి  తెలంగాణ రాష్ట్ర సమితి  పేరే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది. ఈ పేరు ప్రజల మనస్సుల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లలో ఇప్పటికీ బలంగా నాటుకుపోయి ఉందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కేవలం మూడేళ్ల క్రితమే తాము జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పటికీ.. ఇప్పుడు హఠాత్తుగా అదే పేరును వేరే కొత్త శక్తులకు కేటాయిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో ఓటర్లు తీవ్రంగా గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని, తద్వారా తమ పొలిటికల్ మైలేజ్ దెబ్బతింటుందని గులాబీ దళం గట్టిగా వాదిస్తోంది. ఈసీ నిబంధనల ప్రకారం కూడా రిజిస్టర్డ్ పార్టీల పేర్లను పోలిన గుర్తులను, పేర్లను కొత్త పార్టీలకు ఇవ్వకూడదనే నిబంధనను వారు గుర్తు చేస్తున్నారు. 

ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో?

ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం కవిత రాజకీయ భవిష్యత్తును శాసించనుంది. సాధారణంగా ఒకే రకమైన ఉచ్చారణ  , ఒకే విధమైన అక్షరాలు ఉండి, ఓటర్లను అయోమయానికి గురిచేసేలా ఉంటే ఈసీ ఆ పేర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఒకవేళ ఈసీ గనుక ఈ 700కు పైగా వచ్చిన అభ్యంతరాలను, ముఖ్యంగా బీఆర్ఎస్ వాదనను పరిగణనలోకి తీసుకుని  TRS అనే అబ్రివియేషన్‌ను తిరస్కరిస్తే.. కవిత మళ్లీ మొదటికొచ్చి తన పార్టీ పేరును, లోగోను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయం వేదికగా కవిత టీఆర్ఎస్ ఈజ్ బ్యాక్  అంటూ క్యాడర్‌లో జోష్ నింపేందుకు, రాష్ట్రవ్యాప్త జెండా పండుగలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ అభ్యంతరాల పర్వం ఆమెకు పెద్ద రాజకీయ అగ్నిపరీక్షగా మారింది.