Kavitha sets the time for her new party: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. గత కొంతకాలంగా తెరవెనుక కసరత్తు పూర్తి చేసిన కవిత.. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కవిత  పార్టీ పేరు, జెండా, గుర్తు , పార్టీ విధివిధానాలను శ్రీరామనవమి రోజున వెల్లడించనున్నారు.   తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో  తెలంగాణ జాగృతి ద్వారా విశేష గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు అదే స్ఫూర్తితో రాజకీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ ఎజెండాలో ప్రధానంగా మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం,  నిరుద్యోగ సమస్యల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశంలో కేవలం పార్టీ ప్రకటన మాత్రమే కాకుండా, తాను రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో కూడా కవిత స్పష్టం చేయనున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె, ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారా లేక మళ్లీ పార్లమెంట్‌కే వెళ్తారా అన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.   బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయడంతో కొత్త పార్టీ పెడుతున్నారు.  హరీష్ రావు, సంతోష్ కుమార్ వంటి వారు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తన తండ్రి కేసీఆర్ చుట్టూ చేరి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు కూడా పార్టీ నుంచి గానీ, తన సోదరుడు కేటీఆర్ నుంచి గానీ ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే కొందరు పెద్దపీట వేస్తుండటం, సీనియర్ కార్యకర్తలను విస్మరిస్తుండటం వల్ల తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆమె ప్రకటించారు. 

Continues below advertisement

బిఆర్ఎస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతాలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యాల నుంచి పక్కకు జరిగిందని కవిత విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి టిఆర్ఎస్ (TRS)ను బిఆర్ఎస్ (BRS)గా మార్చడాన్ని ఆమె ఆది నుంచి వ్యతిరేకించారు. కాంట్రాక్ట్ పద్ధతి, ధర్నా చౌక్ ఎత్తివేత, రైతుల అరెస్టుల వంటి ప్రభుత్వ నిర్ణయాలను తాను పార్టీలో ఉండి ప్రశ్నించినందుకు తనను కావాలనే పక్కన పెట్టారని ఆమె వెల్లడించారు. బిసి రిజర్వేషన్లు, నిరుద్యోగ సమస్యలపై తాను చేస్తున్న పోరాటాన్ని 'పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు'గా ముద్ర వేసి తనను సస్పెండ్ చేయడం ద్వారా చర్చలకు తావు లేకుండా చేశారని, అందుకే ప్రజల గొంతుకగా మారడానికి కొత్త పార్టీని స్థాపించడమే ఏకైక మార్గమని ఆమె నిర్ణయించుకున్నారు.                         

 

Continues below advertisement