Kavitha on Pawan Kalyan:  తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పోల్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ ఆనవాళ్లను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

Continues below advertisement

 తెలంగాణను అవమానించిన ‘సినిమా స్టార్’.. కేసులేవీ? 

జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే ఒక సినిమా నటుడు  ఇక్కడ సభ పెట్టి, తెలంగాణ వాదాన్ని వేర్పాటువాదంతో పోల్చడం దుర్మార్గమన్నారు. మనం ఎప్పుడైనా దేశం నుంచి వేరవుతామన్నామా? రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే వేర్పాటువాదులంటారా? ఆ తలకాయ లేని సినిమా స్టార్‌పై దేశద్రోహం కేసు పెట్టేందుకు ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. అదే మేము సింగరేణి కార్మికుల కోసం, ప్రజా సమస్యలపై సచివాలయం ముందు ధర్నా చేస్తే మాత్రం మాపై కేసులు పెడతారు" అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక మళ్లీ తెలంగాణపై పక్క రాష్ట్రం పెత్తనం తెచ్చే కుట్రలు దాగున్నాయని హెచ్చరించారు.

Continues below advertisement

 తెలంగాణ తల్లి, కాకతీయ చిహ్నాలపై రేవంత్ దాడి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ భావజాలంపై దాడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాచరిక పోకడలంటూ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తీసేశారని, చార్మినార్, పూర్ణకుంభాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అంతేకాకుండా, సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని దుయ్యబట్టారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో  బతుకమ్మ  లేకుండా చేసి, ఉద్యమ కాలం నాటి ఆనవాళ్లను గూగుల్‌లో కూడా దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో 2009లో పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా స్మార్ట్ సిటీ పనుల పేరుతో తొలగించి ఇంకా పునరుద్ధరించలేదని మండిపడ్డారు.

 రవీంద్రభారతిలో మనోళ్లను కాదని ఆంధ్రా విగ్రహాలా? 

తెలంగాణ కళాకారుల అడ్డాయైన రవీంద్రభారతిలో తెలంగాణేతరుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని కవిత తప్పుపట్టారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలనుకుంటే ఏ ఫిల్మ్ సిటీలోనో, థియేటర్లలోనో పెట్టుకోవాలే తప్ప రవీంద్రభారతిలో కాదన్నారు. మన గద్దరన్న పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం ఏంటని, ఆయనకు సినిమాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. గద్దర్ పేరిట జానపద అకాడమీ పెట్టాలే తప్ప, ఇలా సినిమా అవార్డులు ఇవ్వడం ఆయనను అవమానించడమేనన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సచివాలయం వద్ద జయశంకర్ సార్ విగ్రహం కోసం, అసెంబ్లీలో మహాత్మా పూలే విగ్రహం కోసం పోరాడాల్సి రావడం అత్యంత ఆవేదన కలిగిస్తోందన్నారు.  

 నెలలు గడిచినా ఉద్యమకారులకు శూన్యం 

జార్ఖండ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యమకారులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి రైల్వే, బస్సు ప్రయాణాల్లో డిస్కౌంట్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 30 నెలలు గడుస్తున్నా ఉద్యమకారులను గుర్తించడంలో కనీస చలనం లేకుండా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. గతంలో 1,200 మంది అమరులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆడిపోసుకున్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై తాము చాలా సీరియస్‌గా కొట్లాడాల్సి ఉందని, భవిష్యత్ కార్యాచరణపై ఉద్యమకారులు దిశానిర్దేశం చేయాలని కోరారు. తన నేతృత్వంలోని పసికూన లాంటి కొత్త రాజకీయ వేదికను ముందుకు నడిపేందుకు అందరి సలహాలు, సూచనలు కావాలని కవిత ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.