Batukamma Kavitha: బతుకమ్మ వేడుకల్లో గిన్నిస్ రికార్డ్ కోసం విచిత్ర వింత పోకడలకు పోవటం దురదృష్టకరమని.. మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిని కాపాడుకునేందుకు ఆరాట పడిన సంస్థ జాగృతి అని కవిత తెలిపారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పదివేల మందితో ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ పండుగ మహిళలను అవమానించినట్లే ఉందని.. వచ్చే సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో లక్ష మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ తో ఇది మహిళల పండుగ అని నిరూపిస్తామన్నారు. ప్రభుత్వం మళ్లీ చేస్తే ఆ మరుసటి సంవత్సరం దాన్ని మించి చేస్తామన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా చింతమడక నుంచి లండన్ వరకు పలు ప్రాంతాలు తిరిగానన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మ లేకుండా చేశారని..తెలంగాణ ద్రోహి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. జై తెలంగాణ అనని సీఎం బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొన్నారని విమర్శించారు. రికార్డ్ కోసం బతుకమ్మ చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఈ పండుగను నిలబెట్టుకున్నారు. మేము ఎప్పుడు రికార్డుల కోసం పండుగ నిర్వహించ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కోటి బతుకమ్మలా జాతర చేశామని.. బొడ్డెమ్మ ల నుంచి కోటి బతుకమ్మల వరకు 28 రోజుల పాటు చేశాం. రికార్డుల కోసం కాదన్నారు. తెలంగాణ సాధన కోసం మాత్రమే చేశామని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్వహించి... బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. మహిళలకు ఏదైనా మంచి జరిగేలా కార్యక్రమం చేయాల్సి ఉందని.. కానీ చేయలేదన్నారు. తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టారంటే తెలంగాణ ప్రజలు అని మత్రమే రావాలి. రేవంత్ రెడ్డి అని రాకూడదన్నారు. రాజకీయపరమైన రిజర్వేషన్ బిల్లు మీద మాత్రం సమస్యలు వస్తున్నాయని..కేసులు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులని చాలా మంది చెబుతున్నారన్నారు. వీళ్లేమో ఇలా కేసులు వేస్తారు..ఇక రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారన్నారు. ఈటల రాజేందర్ ఎన్నికలకు వెళ్లవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని అంటారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మేము క్యాన్సిల్ చేయిస్తామని అంటారు. ఈటల, బీజేపీ పార్టీ వాళ్లు కోర్టులా, జడ్జిలా అని ప్రశ్నించారు.
మీ అధ్యక్షుడు జీవోను స్వాగతిస్తున్నా అంటాడు. ఈటల మాత్రం వేరేగా మాట్లాడుతారు. అసలు ఒక ఉద్యమకారుడిగా పేరున్న ఈటల ఇలా మాట్లాడవచ్చా? బీసీ బిడ్డ అయిన మీరు అలా మాట్లాడతారా తక్షణమే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఇక్కడున్న ఎనిమిది మంది ఎంపీలు వెళ్లి మోడీ కాళ్లు పట్టుకోని రిజర్వేషన్లు తెప్పించాలని సూచించారు. గ్రామ పంచాయితీల వారీగా మీ కులగణనను బయట పెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నామని.. ఇవ్వాళ బీజేపీ మీద బాధ్యత ఉంది. బీసీ బిల్లు పాస్ చేస్తారో లేదో చెప్పాలన్నారు. బీసీ లకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తే...ఆ తర్వాత చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. రెండేళ్ల పాటు కాళేశ్వరం రిపేర్ చేయకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఎండబెట్టింది. ఆ ఉసురు ఊరుకే పోదు. కచ్చితంగా కాంగ్రెస్ కు తగులుతుందని హెచ్చరించారు.