Kasani Gnaneshwar: టీటీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు.  ఇవాళ టీడీపీ సెంట్రల్ కమిటీతో కాసాని భేటీ అయ్యారు. తెలంగాణలో పోటీకి దూరంగా ఉందామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలంగాణ టీడీపీ నేతలు లోకేష్‌కు వివరించారు. అయినా చంద్రబాబు నిర్ణయాన్ని అందరూ సమర్ధించారని లోకేష్ చెప్పగా.. కమిటీ నిర్ణయంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా చేశారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో టీటీడీపీ వర్గాలు డీలాపడ్డాయి. అధినేత నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యంలో కూరుకుపోయారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ లేదని లోకేష్ తేల్చేయడంతో కాసాని అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆందోళనలో ఉన్న టీడీపీ వర్గాలకు కాసాని రాజీనామాతో షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసానికి ఆ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అలాగే ఆర్ధికంగా కూడా ఆయనకు బలం ఉంది. దీంతో కాసాని పార్టీలో చేరగానే ఆయనకు టీటీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఖమ్మం, హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అలాగే ఇంటింటికి టీడీపీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టారు. 


ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయంలో జరిగిన అభివృద్దిని కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశారు. తెలంగాణలో టీడీపీ అవసరం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించారు. అలాగే ఈ ఎన్నికల్లో తొలుత పోటీలోకి దిగాలని టీటీడీపీ భావించింది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని భావించారు. త్వరలో బస్సు యాత్ర చేపట్టాలని కూడా భావించారు. కానీ చంద్రబాబు అరెస్ట్‌తో పరిణామాలు మారిపోయాయి. చంద్రబాబు జైల్లో ఉండటంతో ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి పార్టీని బలోపేతం చేయాలని కాసానికి తెలిపారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయవద్దని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్దం కావాలని కాసానికి సూచించారు.


అయితే పోటీ చేయకపోతే పార్టీ మరింత బలహీనపడుతుందని కాసాని భావించారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. పార్టీని వీడనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. దీంతో అనుచరులు, అభిమానులతో చర్చలు జరిపారు. కాసాని పార్టీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది. నేడు లేదా రేపు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించేస్తారని అనుకున్నా. కానీ ఈ రోజే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  అయితే తెలంగాణలో టీడీపీకి అంత బలం లేదు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా ఉంటుంది. దీంతో తెలంగాణలో పోటీ చేయవద్దని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.