BJP Janasena : తెలంగాణ బీజేపీ- జనసేన పొత్తుపై రగడ ప్రారంభమయింది. ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఏ స్థానం ఇస్తారు.. ఎవరిపై సీటుకు ఎసరు వస్తుందో అన్న భయందోళనలలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో వేరువేరుగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నేతలు సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇవ్వడమనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శేరిలింగంపల్లి టికెట్ రవి యాదవ్‌కు వచ్చేలా పావులు కదుపుతూ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయినట్లు తెలిసింది.
శేరిలింగంపల్లి జనసేనకు ఇచ్చేది లేదన్న ధర్మపురి అరవింద్
శేరిలింగంపల్లి టిక్కెట్ ను జనసేనకు కేటాయిస్తున్నట్లు గాప్రచారం జరుగుతోందని దీనిపై స్పందించాలని ఓ కార్యకర్త ..సోషల్ మడియాలో ఎంపీ దర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు. అయితే తనకు తెలిసి అలాంటిదేమీ లేదని.. అక్కడ రవి యాదవ్ మంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారని ఆయన విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
[
కూకట్ పల్లి ఇవ్వొద్దని బీజేపీ నేతల నిరసనలు
కూకట్ పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు. కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్‌ను గెలిపించడమేనని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.
పొత్తులు, స్థానాలపై ఇంకా రాని స్పష్టత
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రెండు పార్టీల మద్య చర్చలు జరుగుతున్నట్లుగా కూడా స్పష్టత లేదు. గతంలో ఓ సారి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తర్వాత ఢిల్లీలో వీరిద్దరూ కలిసి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. పవన్ కల్యామ్.. కుటుంబ కార్యక్రమం కోసం ఇటలీ వెళ్లారు. మరో వైపు మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయిస్తారంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఉన్న నియోజకవర్గాల కు చెందిన నేతలు.. ఆందోళనకు గురవుతున్నారు. తమ స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొద్దంటున్నారు.