Bandi Sanjay Interesting Comments on Harish Rao: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భారత్ రాష్ట్ర సమితి (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనే తేడా లేకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరిపోతున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని.. కానీ అలా రావాలనుకుంటే ఎమ్మెల్యేలు కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే రావాలంటూ షరతు పెట్టటంతో వెనకంజ వేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల జాబితాలో పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు.
హరీష్ రావు గుడ్ పొలిటీషియన్
తాజాగా హరీష్ రావు కూడా పార్టీ మారుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై హరీష్ రావు పలుమార్లు క్లారిటీ ఇస్తూ, అవన్నీ వదంతులేనని కొట్టిపాడేశారు. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఇదే విషయంపై స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు మంచి నాయకుడని.. ప్రజల మనిషి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడాడని.. ప్రజల కోసం నిత్యం ఆరాటపడే నాయకుడు అంటూ ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. ఆ కుటుంబ సభ్యులందరిపై అవినీతి ఆరోపణలున్నాయని.. కానీ హరీష్ రావు ఒక్కడే వివాదరహిత నేత అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
పదవికి రాజీనామా చేయాల్సిందే
తాను ఇలా చెబుతున్నానంటే.. హరీశ్ రావుకు నేను ఫోన్ చేశాననో, మాట్లాడాననో.. ఆయన బీజేపీలోకి వస్తున్నారనో అర్థం కాదన్నారు. హరీష్ రావుపై తనకున్న అభిప్రాయం అంటూ బండి సంజయ్ చెప్పారు.. హరీష్ రావు బీజేపీలోకి రావాలన్నా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎలాగూ హరీష్ రావుకు జనాధరణ బాగానే ఉంది కాబట్టి ఆయన ఈజీగానే గెలుస్తాడన్నారు. ఎవరు తమ పార్టీలో చేరాలనుకున్నా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే అన్నారు. తమ పార్టీలోకి వచ్చిన వారిని గెలిపించుకునే సత్తా తమ కార్యకర్తలకు ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలు తోపులు అని కీర్తించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఎనిమిది స్థానాలను గెలిచామని, బీఆర్ఎస్ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం వల్ల అందరూ బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమౌతుందంటూ వస్తోన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఉన్నట్లుండి హరీష్ రావును ఇంతగా పొగడాల్సిన అవసరం ఏమొచ్చిందని జనాలు చర్చించుకుంటున్నారు.