Kondagattu Anjanna Temple | కొండగట్టు అంజన్న భక్తుల సౌకర్యార్థం 96 గదుల భారీ సత్రం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ద్వారా 35.19 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు కావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

Continues below advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత నయాపైసా కూడా ఇవ్వకుండా భక్తులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలయానికి ఎలాంటి నిధులు కేటాయించకపోగా, ఆర్జిత సేవల ఛార్జీలను పెంచి భక్తులపై అదనపు భారం మోపిందని బండి సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటలకే పరిమితం..భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. భక్తుల అవసరాలను గుర్తించి టీటీడీ ద్వారా 35 కోట్లు మంజూరు చేయించడం అభినందనీయమని అన్నారు. దేవాలయాల పట్ల నిజంగా ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పాలకులు కేవలం మాటలకే పరిమితం కాకుండా కొండగట్టు ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని బండ సంజయ్ డిమాండ్ చేశారు.

Continues below advertisement

పవన్ కళ్యాణ్ - కొండగట్టుతో అనుబంధం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో తన ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి'కి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు నిర్వహించడం తెలిసిందే. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించాక సైతం కొండగట్టు అంజన్నను మరోసారి పవన్ దర్శించుకున్నారు. అంజన్న దర్శనానికి వచ్చిన సమయంలో ఆలయం అభివృద్ధి కోసం ఏమైనా చేయాలని ఉందని, తనకు తోచిన సాయం అందేలా చేస్తానని మాటిచ్చారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించి కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేపించారు. కొండగట్టు ఆలయం, అంజన్నపై ఉన్న భక్తితోనే పవన్ టీటీడీ ద్వారా నిధుల కేటాయింపుకు చొరవ చూపారు. 

టీటీడీ సహాయం: తిరుమల తిరుపతి దేవస్థానం తన 'శ్రీవాణి ట్రస్ట్' లేదా ఇతర నిధుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణకు, భక్త నివాసాల (సత్రాల) నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుంటుంది. ప్రస్తుతం కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు టీటీడీ అందిస్తోంది. 96 గదులతో భక్తులకు బస కోసం సత్రం నిర్మించడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. హనుమాన్ దీక్ష చేపట్టే భక్తులు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే వారికోసం దీక్షా విరమణ మండపాన్ని సైతం నిర్మించే అవకాశం ఉంది.

హనుమాన్ దీక్ష: కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్ దీక్షలకు ప్రసిద్ధి. ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష చేపట్టి మాల విరమణ చేస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా వసతి గదులు, త్రాగునీరు, క్యూ లైన్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల ఇక్కడ అత్యవసరం.