రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం రాక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరింత వివాదాస్పమవుతోంది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా ధర్నాలకు దిగింది. రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లెటర్‌ రాశారు. 


రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాలు కరీంనగర్‌ రాజకీయాల్లో చిచ్చు పెట్టాయి. ఎమ్మెల్యే చందర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు800 మంది నిరుద్యోగుల నుంచి ఆరు నుంచి పదిహేను లక్షల వరకు వసూలు చేసినట్టు చెబుతు పీసీసీచీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.  


నిరుద్యోగ యువకులను అనేక విధాలుగా నమ్మించి మోసం చేశారని రేవంత్‌ వివరించారు. ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని నమ్మబలికారన్నారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగాల నియామకంలో చేతులు మారినట్టు పేర్కొన్నారు. అయితే రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిపోవడంతో సీన్ మారిపోయిందని తెలిపారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గతంలో నియమించిన వారిలో సగం మందిని తొలగించారు. ఇదే ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరికొందరు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. 


ఈ క్రమంలోనే ఈ తొలగింపులో తీవ్రంగా మానసిక ఆందోళనకు గురైన కేశవపట్నం మండలం అమ్మలపురం గ్రామానికి చెందిన హరీష్ గౌడ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు సీఎం దృష్టికి తీసుకొచ్చారు రేవంత్. సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రేపు రామగుండంలో కేసీఆర్ టూర్ ఉన్నందున ఆ డెడ్‌బాడీనీ రామగుండంలో కాకుండా  కరీంనగర్‌లో పోస్టుమార్టం చేశారన్నారు. 


ఇన్ని అక్రమాలు, అవినీతి జరుగుతున్నా కేసీఆర్, కేటీఆర్ స్పందించడం లేదన్నారు రేవంత్. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులనైనా జైల్లో వేస్తా అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రామగుండంలో ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వెంటనే చర్యలు తీసుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, ఎమ్మెల్యే చందర్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 


ఈ విషయంలో పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్, సుజిత్, పైసా రవి, అంజన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఉద్యోగాలు తీసేసిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాల్నారు. మృతి చెందిన హరీష్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. 


డిమాండ్లు...


1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బర్తరఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. 


2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.


3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.


4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీనును వెంటనే విడుదల చేయాలి.


5. మొత్తం వ్యవహారంలో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి..


రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ నిర్వాకంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి సంఘీభావంగా  మంచిర్యాల చౌరస్తా సివిల్ హాస్పిటల్ వద్ద రాస్తారోకో చేశారు  కాంగ్రెస్‌నేతలు. మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ సహా ఇతర నేతలు పాల్గొనన్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు సమీపంలోని స్టేషన్‌కు తరలించారు. 


రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగం కోల్పోయిన హరిశ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిన సమయంలో కాంగ్రెస్ కృషితోనే  మళ్ళీ తెరిపించామాని కానీ టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతుందన్నారు. ఎమ్మెల్యే చందర్ అక్రమాల మూలంగా నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం... దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు..