Sri Venugopala Swamy Temple Telugu News | చొప్పదండి: సామాన్యంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరమైన ప్రదేశంలో భక్తితో ప్రశాంతతతో ఉంటారు. కొంతమంది మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్తారు. ఎందుకంటే...? ఆలయంలో అడుగు పెట్టగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయంలో నిర్వహించే పూజలు భజనలతో మైండ్ రిలాక్స్ అవుతుందని నమ్మకం. కానీ ఈ ఆలయంలో మాత్రం అడుగుపెట్టగానే తల నుంచి మొదలుకొని అరికాలు వరకు వణుకు పుడుతుంది. సుమారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం మూతపడింది అసలు ఈ ఆలయంలో ఏం జరుగుతుంది...? ఈ ఆలయంలో పూజలు ఎందుకు నిర్వహించడం లేదు...?
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పురాతనమైన వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం నెలకొంది. సుమారు 1600 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో ఎంతో వైభవంగా వేణుగోపాల స్వామి వారికి నిత్యం పూజలు నిర్వహించేవారు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేవారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఆలయంలో గర్భగుడిలో వేణుగోపాలస్వామి దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, అమ్మవారు కూడా ఉంటారు. అయితే ఈ ఆలయంలో వేణుగోపాల స్వామిని దర్శించి పూజలు ఆచరించిన వారికి సకల కోరికలు తీరేవని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో పురాతన కాలం నుంచి పూర్వకాలంలో హనుమంతు అనే అర్చకులు గా ఉండేవారు. ఆలయంలోని వేణుగోపాల స్వామికి నియమనిష్టలతో ఎంతో ఘనంగా వైభవంగా పూజలు నిర్వహించే వారిని అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో కాళీమాత విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజలు నిర్వహించే వారిని గ్రామస్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వేణుగోపాలస్వామి తోపాటు కాళీమాతకు కూడా క్షుద్ర పూజలు నిర్వహించి నాటు వైద్యం చేసేవారని గ్రామస్తులు అంటున్నారు. నాటు వైద్యం చేస్తున్న విషయం కొన్ని ప్రాంతాలకు పాకడంతో ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ నాటువైద్యం చేయించుకునే వారు. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని గ్రామస్తులు అన్నారు.
అయితే సుమారు 50 సంవత్సరాల క్రితం ఆలయ అర్చకుడు హనుమంతు తాను మరణిస్తే తన దేహాన్ని ఆలయ ప్రాంగణంలోనే పూడ్చి పెట్టాలని గ్రామస్తులతో అన్నారని చెప్పారు. అయితే చెప్పిన కొద్ది రోజులకే అర్చకులు మరణించడంతో తాను చెప్పిన విధంగా ఆలయంలో కాకుండా గ్రామ శ్రేయస్సు కోసం పెద్దల నిర్ణయం ప్రకారం అంతక్రియలు స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం ఎలాంటి పూజలకు నోచుకోవడం లేదని అప్పుడప్పుడు ఆలయ ప్రాంగణంలో ఏవో రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు కూడా వచ్చేవని గ్రామస్తులు తెలిపారు. కానీ ఈ గ్రామస్తులకు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని తాము ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడం లేదని మరికొందరు చెబుతున్నారు.