ఆర్టీసీ సంస్థను లాభాల్లో ఉంచేందుకు అయితే బస్సు ఆక్యుపెన్సి పెంచమని సిబ్బందికి ఆదేశాలు ఇస్తుంటారు ఆర్టీసీ అధికారులు. ఈ నేపథ్యంలోనే బస్సు సీటింగ్ కెపాసిటీకి మించి నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సులు రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సులో 42 మంది కూర్చోవాల్సి ఉండగా 60 నుంచి 70 మందికి ఎక్కించుకొనిమరీ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఇలా చేయడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ గతంలో కొండగట్టులో జరిగిన ఘటన. ఆ ఘటనకి కారణం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ నిర్లక్ష్యమే అంటూ వారిపై దుమ్మెత్తి పోశారు సామాన్య ప్రజలు.
కానీ అందరు డ్రైవర్లు ఒకేలా ఉండరని నిరూపించుకుంటున్నారు కొంతమంది డ్రైవర్లు. ఆర్టీసీ సంస్థను లాభాల్లో ఉంచడమే కాదు ప్రయాణికుల భద్రత కూడా అవసరమని అంటున్నారు. అంతేకాదు బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి కూర్చుంటే ప్రయాణికులను బస్సులో నుంచి దింపేస్తున్నారు. వినకపోతే ఏకంగా బస్సునే పక్కన పెట్టేస్తున్నాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. ఈ ఘటన ఎక్కడ అని అనుకుంటున్నారా?
సిరిసిల్ల నుండి వరంగల్ కు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు హుజురాబాద్ కు చేరుకుంది అప్పటికే రక్షాబంధన్ పండుగ ముగించుకొని తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు సిరిసిల్ల నుండి వరంగల్ వరకు వెళ్లే వారంతా కరీంనగర్, హుజూరాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. అయితే కరీంనగర్ లోనే ఫుల్ అయిపోయిన బస్సు హుజురాబాద్ లో కొంతమంది ప్రయాణికులు దిగిపోవడంతో అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న మరికొంత మంది ప్రయాణికులు ఈ బస్సుపై ఎగబడ్డారు. అప్పటికే నిండుకుండలా ఉన్న ఆ బస్సు మరికొంతమంది ప్రయాణికులు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది.
అయినప్పటికీ ప్రయాణికులు బస్సులో ఎక్కేశారు. కానీ బస్సు డ్రైవర్ నిరాకరించినప్పటికీ ప్రయాణికులు వినకపోవడంతో డ్రైవర్ బస్సును మెల్లిగా వరంగల్ వైపు ప్రయాణించసాగాడు. కానీ బస్సులో ఉండే సైడ్ మిర్రర్స్ కి ప్రయాణికులు అడ్డంగా ఉండటంతో వచ్చే పోయే వాహనాలు కనబడకుండా ఉండిపోయింది. దీనితో ప్రయాణికులను అద్దానికి అడ్డుగా నిలబడవద్దు అని అద్దంలో వచ్చే పోయే వాహనాలు కనబడకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులకు డ్రైవర్ హెచ్చరించారు. అయినప్పటికీ ప్రయాణికులు డ్రైవర్ మాట వినకపోవడంతో బస్సుని పక్కన పెట్టేశారు. బస్సులో ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందని కొంతమంది ప్రయాణికులు దిగాల్సిందిగా ప్రయాణికులను కోరారు. ఓవర్ లోడ్ తో వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్ తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.