Power Cuts in Telangana | జగిత్యాల: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విద్యుత్ శాఖ ఎస్ఈ తాము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ అయింది. అయితే అధికారిక కార్యక్రమంలో పవర్ కట్ కావడంతో బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. 


24 గంటలు కరెంట్ అని ప్రసంగిస్తుంటే పవర్ కట్ 
జగిత్యాలలో నిర్వహించిన జడ్పి సర్వసభ్య సమావేశంలో పవర్ కట్స్ లేవని... 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ఏకంగా విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ ప్రసంగిస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అధికారిక కార్యక్రమంలో పవర్ కట్ కావడం, అది కూడా విద్యుత్ కోతలు లేవని చెబుతున్న సమయంలో కరెంట్ పోవడంతో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జడ్పి చైర్ పర్సన్ వసంత, జడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్ నవ్వుకున్నారు. అయితే కరెంట్ ఇప్పుడెలా పోయిందని మహిళ జడ్పిటిసీలు ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ కుమార్ హాజరైన కార్యక్రమంలో ఇదే పరిస్థితి ఎదురైంది. కరెంట్ కోతలు లేవని, తెలంగాణ ప్రభుత్వం చెప్పేవన్నీ కోతలేనంటూ సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేశారు. 






అప్పుడు వపర్ కట్‌కు కారణం ఇదీ 
జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశంలో కరెంట్ కోతలపై అధికారులు స్పందించారు. సమావేశం జరుగుతుంటే పవర్ కట్ కావడానికి కారణాలను వెల్లడించారు. జడ్పీ మీటింగ్ జరుగుచున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ పై తొండ పడటం వల్ల బ్రేకర్ ట్రిప్ అయినట్లు తెలిపారు. రామాలయం గ్రౌండ్ దగ్గరలో గల SS 128, 100 KVA ట్రాన్స్ ఫార్మర్ 11 KV HG ఫ్యూజ్ పైన తొండ పడి, అక్కడి 33/11 KV, దరూర్ సబ్ స్టేషన్ లోని ఎల్ వి బ్రేకర్ ట్రిప్ అవడంతో కరెంట్ పోయినట్లు తెలిపారు. వెంటనే (టీజీఎన్ పీడీసీఎల్) TGNPDCL విద్యుత్ స్టాఫ్ స్పందించి కేవలం రెండు నిమిషాల్లో ట్రాన్స్ ఫార్మర్ పైన పడిన తొండను తీసేశారు. వెంటనే లైన్ ఛార్జ్ చేసి పవర్ సప్లై చేసినట్లు వివరించారు.