Telangana Politics: తెలంగాణ ప్రజల తీర్పు సర్వేలకు కూడా అందని రీతిలో ఉండబోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో ప్రజలు మనసులోని మాట చెప్పకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఫలితం బీజేపీ వైపే ఉంటుందని ఈటల అన్నారు.


ఇంకా ఎన్నికలకు 6 నెలల సమయం ఉందన్న ఈటల.. రాష్ట్రంలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తుందని, తప్పకుండా తెలంగాణలో అధికారం చేపడతామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే కొన్ని నెలలుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పిన ఈటల.. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. నయీమ్ కే భయపడలేదు, ఈ బెదిరింపులకు భయపడతానా అని అన్నారు. తనతో పెట్టుకుంటే మాడిమసైపోతారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల హెచ్చరించారు. 



పార్టీ మార్పుపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలపై ఈటల సమాధానం ఇచ్చారు. దుస్తులు మార్చుకున్నంత సులువుగా పార్టీలు మారలేమన్నారు. బీఆర్ఎస్ నుంచి తనకు తానుగా బయటకు రాలేదని, గెంటేస్తేనే వచ్చానని మరోసారి గుర్తుచేశారు. పార్టీ నుంచి తనను బయటకు పంపించినప్పుడు కేసీఆర్ కుటుంబీకులు బాధపడి ఉంటారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలు తనకు కొత్త అని.. తాను స్వయంగా దిల్లీకి వెళ్లలేదని, అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది కాబట్టే దిల్లీకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కొట్టేది, ఆ పార్టీకి ప్రత్యమ్నాయం బీజేపీనేనని పునరుద్ఘాటించారు.


"బీజేపీ నాయకులతో ఫోటో దిగితే సంక్షేమ పథకాలు రావని, దళితబంధు, బీసీ బంధు, ఇతర పథకాలు ఇవ్వరని బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో ప్రజలు తమ మనసులో ఉన్న మాటను బయటకు చెప్పకపోవచ్చు గానీ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే తమ బతుకులు ఆగమేనని ప్రజలు అనుకుంటున్నారు."- ఈటల రాజేందర్


ఈటలను చంపేందుకు కుట్ర: ఈటల జమున


అంతకుముందు ఈటల రాజేందర్ సతీమణి జమున హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు జమున ఆరోపించారు. రూ. 20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిపిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారని జమున ఆరోపించారు. మా కుటుంబసభ్యులకు ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి సీఎం కేసీఆర్ దే బాధ్యత అని అన్నారు. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క అని, పిచ్చి కుక్కను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజల మీదకు వదిలారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో పిచ్చికుక్క అరాచకాలు పెరిగిపోయాయని, నియోజకవర్గ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరవీరుల స్తూపాన్ని ఉద్యమంలో లేని పిచ్చికుక్క కూల్చివేయించాడని, అమరవీరుల స్తూపం తాకే అర్హత ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. తెలంగణ ఉద్యమకారులు అంటే మొదట వినిపించే పేరు ఈటల రాజేందర్ అని చెప్పారు.